కోలుకున్న తర్వాత ఊపిరితిత్తులపై దాడి చేస్తున్న కరోనా
కొవిడ్-19 వ్యాధి దుష్ప్రభావాలపై నిపుణులు ముందు నుంచే హెచ్చరిస్తున్నారు. దీని నుంచి కోలుకున్నతర్వాత కూడా ఊపిరితిత్తుల లాంటి ముఖ్యమైన అవయవాలు దెబ్బతింటున్నట్లు చెబతున్నారు. అలాగే, గుండెకూ ముప్పు పొంచి ఉందని, శరీరంలో వివిధ ప్రాంతాల్లో నొప్పి ఉంటుందని పేర్కొన్నారు. అయితే, కొవిడ్ నుంచి కోలుకున్న మూడు నెలల తర్వాత ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయని తాజా అధ్యయనంలో తేలింది.
ఆస్ట్రియా దేశంలోని టైరోలియన్ ప్రాంతంలోగల వివిధ సంస్థల పరిశోధకులు కొవిడ్‌తో బాధపడుతున్నరోగులపై అధ్యయనం జరిపారు. వారు కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేయకుండా ఆరు, పన్నెండు, ఇరవై నాలుగు వారాల తర్వాత వారిని పరీక్షించారు. ఆరు వారాల వ్యవధిలో చాలా మంది పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు తేలింది. కొంతమంది రోగులు ఊపిరి ఆడకపోవడం, దగ్గు సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. సగం మందికి పైగా రోగులకు కనీసం ఒక నిరంతర లక్షణం ఉన్నట్లు కనుగొన్నారు. ఎక్కువగా శ్వాస తీసుకోలేకపోవడం, దగ్గు ఉన్నట్లు కనుగొన్నారు. సిటీ స్కాన్లలో 88 శాతం మంది రోగులలో ఊపిరితిత్తుల నష్టం కనిపించింది.
12 వారాల తరువాత పరీక్షించగా, రోగులలో లక్షణాలు మెరుగుపడ్డాయి. ఊపిరితిత్తుల నష్టం 56 శాతానికి తగ్గింది. మూడవ సందర్శన, దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయిన 24 వారాల తరువాత ఇంకా సమస్య అలాగే ఉంది. ఇది కచ్చితంగా చెడువార్తేనని, కొవిడ్ నుంచి కోలుకున్నవారిలో చాలామందికి మూడు నెలల తర్వాత ఊపిరితిత్తుల సంబంధ సమస్యలు వస్తున్నాయని ఇన్స్‌బ్రక్‌లోని యూనివర్సిటీ క్లినిక్‌లో పీహెచ్‌డీ విద్యార్థి, అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకురాలు డాక్టర్ సబీనా సహానిక్ పేర్కొంది. అయితే, ఇక్కడ ఓ శుభవార్త కూడా ఉందని, అదేంటంటే కొవిడ్ వల్ల బలహీనపడ్డ ఊపిరితిత్తులు తమకు తామే రిపేర్ చేసుకునే సామర్థ్యం కలిగి ఉన్నాయని, కాలక్రమేణా ఊపిరితిత్తుల సమస్యలు తగ్గిపోతున్నట్లు గుర్తించామన్నారు.