నవంబర్‌లో దుబ్బాక ఎన్నికలు ?
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, పెండింగ్‌లో ఉన్న 65 స్థానాలకు ఉప ఎన్నికలు ఒకేసారి నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం శుక్రవారం తెలిపింది. వివిధ రాష్ర్టాల శాసనసభలలో 64 స్థానాలకు అదేవిధంగా ఒక లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. కేంద్ర బలగాల మోహరింపు ఇతర కారణాలతో రెండింటిని ఒకేసారి నిర్వహిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. ప్రస్తుత బిహార్ అసెంబ్లీ నవంబర్ 29వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో బీహార్ అసెంబ్లీకి అక్టోబర్-నవంబర్‌లో ఈసీ ఎన్నికలను నిర్వహించేందుకు సమాయత్తమౌతోంది. ఈ నేపథ్యంలో బీహార్ సాధారణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అదేవిధంగా వివిధ రాష్ర్టాల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఈసీ తెలిపింది. కోవిడ్-19, అధిక వర్షాల కారణంగా ఆయా రాష్ర్టాల్లో జరగాల్సిన ఉపఎన్నికలు ఇటీవల వాయిదా పడ్డాయి. తెలంగాణలో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. అధికార టీఆర్ఎస్ పార్టీ, దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించారు. ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జీ, రాష్ర్ట ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పార్టీ అభ్యర్థి విజయానికి ప్రయత్నాలు ప్రారంభించారు. పార్టీ అభ్యర్థి గెలుపు మాత్రమే కాకుండా ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు డిపాజిట్ గల్లంతు అయ్యేలా హరీశ్‌రావు క్షేత్రస్థాయిలో తిరుగుతూ అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నారు.