ఆరోగ్యకరమైన ఆహారంతో కొవిడ్-19కు దూరం
మనిషి వ్యాధులతో పోరాడేందుకు, ఇన్ఫెక్షన్ల నుంచి బయట పడేందుకు మనం తీసుకునే ఆహారమే కీలకం. ఆరోగ్యకరమైన, పోషకాలతో కూడిన, సమతుల ఆహారం తీసుకోవడం ఈ మహమ్మారి సమయంలో చాలా ముఖ్యం. ఆహారం కొవిడ్-19 ఇన్ఫెక్షన్‌ను నయం చేయదు గానీ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుని, తగినంత శారీరక వ్యాయామం చేయడం వల్ల అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్‌తో పోరాడేందుకు కావల్సిన రోగనిరోధకశక్తి సమకూరుతుంది.
ఆరోగ్యకరమైన ఆహారం ప్రాధాన్యం గురించి మెడికవర్ ఆసుపత్రులకు చెందిన నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ కన్సల్టెంట్ డైటీషియనిస్ట్ మరియు న్యూట్రిషనిస్ట్, నాగరాజు కే. మాట్లాడుతూ “మన శరీర వ్యవస్థకు సౌర గడియారంతో సంబంధం ఉంది. ఇది పూర్తిగా విభిన్నమైన ప్రపంచం. రోజూ ఒకే సమయానికి తినడం వల్ల శక్తిస్థాయి స్థిరంగా ఉంటుంది. బాగా ఎక్కువ, తక్కువ కాదు. దీనివల్ల శరీర లయ ఒక పద్ధతిలో ఉండి, తగినంత శక్తివంతంగా ఉండేందుకు అవసరమైన హార్మోన్లను తగినంత స్థాయిలో ఉంచుతుంది. సహజమైన పద్ధతికి దగ్గరగా ఉండే ఆహారం ఏదైనా, వీలైనం తక్కువగా వండి, ఆ కాలంలో దొరికేదైతే ఆరోగ్యానికి మంచిది. పోషకాలతో కూడిన ఆహారం ఆరోగ్యాన్ని ఇస్తుంది కానీ వండిన ఆహారం అయితే కేవలం కేలరీలను ఇస్తూ, తగినంత శక్తిని ఇవ్వవు. అందువల్ల నీరసంగా అనిపించి, అనేకరకాల వ్యాధులు రావచ్చు. పులియబెట్టిన ఆహారంలో మంచి బ్యాక్టీరియా ఉండి, పోషకాలు సమర్ధంగా అరిగేందుకు ఉపయోగపడుతుంది” అని వివరించారు.