చంద్రబాబును ఆ మాట అనేసిన లక్ష్మీపార్వతి
చంద్రబాబుకు దమ్ము, ధైర్యం, వ్యవస్థల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆయన చేసిన అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణకు సిద్ధపడాలని ఏపీ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి సవాలు విసిరారు. గతంలో తాను చంద్రబాబు అక్రమాలపై వేసిన కేసును 14 ఏళ్లపాటు స్టేలతో అడ్డుకున్నారని తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో లక్ష్మీపార్వతి మాట్లాడారు. ఆమె ఇంకా ఏమన్నారంటే…
► చంద్రబాబు అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాస్తున్నాను. ఈ మేరకు నా విజ్ఞప్తిని అంగీకరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, న్యాయ వ్యవస్థకు కూడా లేఖ రాస్తున్నా. దీనిపై ప్రధాని స్పందించి విచారణకు ఆదేశించాలి.
► చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్‌ను అవినీతిమయం చేసి ఏటీఎంగా మార్చారన్న ప్రధాని.. గత ప్రభుత్వ అవినీతిని ఎత్తి చూపించారు.
► ఇప్పుడైనా ఆ అవినీతిపై విచారణకు ఆదేశించాల్సిన బాధ్యత ప్రధానిపై ఉంది.
► ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేశారో బాబు స్పష్టం చేయాలి. కనీస ఆధారాలే లేకుండా ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రధానికి బాబు లేఖ ఎలా రాస్తారు.
► చంద్రబాబు అవినీతి సామ్రాజ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయం ముసుగులో బాబు వ్యవస్థలను దోపిడీ చేస్తున్నారు.