ఊహలు v/s వాస్తవాలు
సహజముగా మనిషి ఆశావాది. ప్రతి మనిషికీ తనకంటూ కొన్ని ఆశయాలు, ఆశలు, ఊహలు, కోరికలు ఉంటాయి. తన కలలను నెరవేర్చుకోవటానికి శాయశక్తులా ప్రయత్నాలు చేస్తాడు. కానీ కొన్నిసార్లు, లేదా చాలా సార్లు ఆ కలలు కల్లలవుతూ ఉంటాయి. తన ఊహలకి, ఆశలకీ, వాస్తవాలు భిన్నంగా సాక్షాత్కరించేసరికి వాటిని స్వీకరించలేక నిరాశ నిస్పృహల్లోకి వెళ్లిపోతుంటాడు. ఒక విద్యార్ధి తానొక గొప్ప ఇంజనీర్ కావాలని కలలు కంటూ ఆ దిశగా కష్టపడి చదవుతుంటాడు. కానీ అతని తల్లిదండ్రులు అతడిని ఒక డాక్టర్‌గా చూడాలనుకుంటారు. కొడుకునూ ఒత్తిడి తీసుకొస్తారు. ఆశల్ని సమాధి చేసుకుంటాడు. ఇష్టం లేని చదువు లేదా వృత్తిపై ఆసక్తి లేని కారణంగా అపజయాలపాలై రెంటికీ చెడ్డరేవడిలా తయారవుతాడు.
మాకు ఇద్దరబ్బాయిలండి. చాలా కష్టపడి మా ఆస్తులు అమ్మిమరీ పిల్లల్ని చదివించామండి. పెద్దబ్బాయి డాక్టర్, చిన్నబ్బాయి సాఫ్ట్‌వేర్. ఇద్దరబ్బాయిలూ అమెరికాలో సెటిల్ అయ్యారు అని గొప్పగా చెప్పుకుంటారు కొంతమంది తల్లిదండ్రులు. కానీ వాస్తవ పరిస్థితి ఏమంటే ముసలి వయసులో ఉన్న వారిని కొడుకులు ఏమాత్రం పట్టించుకోవట్లేదని లోలోపల మదనపడుతుంటారు.
పెళ్లైన కొత్తజంటలు ఈ ప్రపంచంలోనే తమది ఒక ఆదర్శదాంపత్యమని మురిసిపోతుంటారు. ఒకరి సంతోషం కోసం మరొకరు ఆరాటపడుతూ, ఒకరి ఇష్టాలకు మరొకరు సర్ధుకుపోతూ “ఆహా ఏమి నా భాగ్యము ! నన్ను అర్ధం చేసుకుని నన్ను అమితంగా ప్రేమించే జీవిత భాగస్వామి లభించారు” అని పొంగిపోతుంటారు. రెండు లేదా మూడు సంవత్సరాలు గడిచేసరికి వారి కొత్తమోజు, ప్రేమ మత్తు పూర్తిగా మాయమై అప్పుడే అసలు కథ మొదలవుతుంది. ఒకరికోసం మరొకరు సర్ధుకుపోవడాలు అస్సలుండవు. కారాలు, మిరాయాలు నూరుకుంటూ కాట్లకుక్కల్లాగా ప్రతి రోజూ పొట్లాడుకుంటా ఉంటారు. మరి కొంతమంది ఆలుమగలు ఇలా అంటుంటారు. మాకు పెళ్లై పాతిక సంవత్సరాలు దాటిందండి. మా మధ్య ఒక్కసారి కూడా బేధాభిప్రాయాలు రాలేదు సుమండి అని గొప్పగా చెబుతుంటారు. భార్యభర్తలలో ఒకరు హీరోగా ఉండి మరొకరు జీరోగా ఉంటే వారి మధ్య తగాదాలు రావటానికి ఆస్కారమే లేదు. కానీ సమస్య ఏమిటంటే సాధరణంగా లోకంలో ఏ భార్య, ఏ భార్త జీరోగా ఉండాలని కోరుకోరు కదా! మరి కిం కర్తవ్యం !
ఈ క్రింది వాస్తవాలను గమనించండి
1) ఎదుటి వారిలో ఎక్కువ ఆశించడం వలన దుఃఖానికి లోనవుతారు
2) ఎదుటి వారిలో తక్కువ ఆశించడం వలన తక్కువ దుఃఖానికి లోనవుతారు
3) ఎదుటివారిలో ఏమీ ఆశించకపోవడం వల్ల దుఃఖానికి అస్సులు లోనుకారు.
పైన ఉదహరించిన మూడు వాస్తవాలలో మీరు దేనిని ఎన్నుకుంటారో మీ ఇష్టం. మీ ఎన్నికపై మీ దుఃఖం లేదా సంతోషం మీకు లభిస్తుంది. ఎదుటివారిలో ఏమీ ఆశించకుండా ఉండటం అసలు సాధ్యమేనా అనే ప్రశ్న మీకు కలిగితే కొద్దిరోజులు మీ జీవితాల్లో సాధన చేసి చూడండి. సాధ్యమేనని మీకే తెలుస్తుంది. ఇంకొక ముఖ్య విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక వ్యక్తిని లేదా మీకు ఎదురైన పరిస్థితిని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించడం అనే అద్బుత కళను నేర్చుకుంటే మీ జీవిత ప్రయాణం సాఫీగా హాయిగా, ఆనందంగా సాగిపోతుంది.
Author : JYOTSNA, LifeCoach
Follow FB Page BestLifecoach (FOR MORE UPDATES)