ఇప్పట్లో స్కూళ్లు తెరవడం కష్టమే

కరోనా వైరస్‌తో స్కూళ్ల ప్రారంభంపై ఇంకా క్లారిటీ లేదు.. విద్యార్థులు స్కూళ్లకు రాకపోయినా.. ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఇవాళ్టి నుంచి ఉపాధ్యాయులు మాత్రం పాఠశాలలకు వెళ్లాల్సి ఉంది.. కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు.. బడుల పునఃప్రారంభం విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. ఈ నెలాఖరుదాకా విద్యా సంస్థలేవీ తెరవొద్దు.. అయితే, క్లాసులు నిర్వహించకపోయినప్పటికీ.. స్కూళ్లను తెరిస్తే కేంద్రం ఆదేశాలను ఉల్లంఘించినట్లవుతుందని సీఎస్ తెలిపినట్టుగా సమాచారం. తాజాగా విద్యాశాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సర్కార్‌..

17వ తేదీ నుంచి ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లాలని, 20వ తేదీ నుంచి 6-10 క్లాస్‌లకు దూరదర్శన్‌ ద్వారా ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 11న అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

ఇక, స్కూళ్లకు టీటర్లు వెళ్లడం, ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణ విషయాలకు సంబంధించి మార్గదర్శకాలను సిద్ధం చేసిన విద్యాశాఖ అధికారులు.. ఆ ఫైలును మూడు రోజుల క్రితమే సీఎస్‌ వద్దకు పంపించారు. అక్కడి నుంచి సీఎం కేసీఆర్‌ అనుమతి తర్వాత ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడాల్సిఉంది. కానీ, అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పాఠశాలల ప్రారంభం వాయిదా పడటంతో ఈనెల 20 నుంచి ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు కూడా ఉండకపోవచ్చు అంటున్నారు. మరో మారు దీనిపై సమీక్ష నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు అధికారులు. మరోవైపు.. ఇవాళ్టి నుంచి ప్రారంభం కావాల్సిన ఆన్‌లైన్‌ తరగతులను వాయిదా వేస్తున్నట్టు ఇంటర్‌ బోర్డు ప్రకటించింది.