తెల్లటి మంచుపై ఉగ్ర రక్కసి మరోసారి కోరలు చాచింది
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద రక్కసి మరోసారి కోరలు చాచింది. తెల్లటి మంచుపై ఎర్రటి రక్తం చిందింది. కుటుంబ సభ్యులతో సరదాగా సెలవులు గడిపి, ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ విధుల్లోకి తిరిగొస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్ల వాహనశ్రేణిపైౖకి ఉగ్రభూతం దూసుకొచ్చి 39 మంది ప్రాణాలు బలి తీసుకుంది. పాకిస్థాన్ గడ్డపై బలం పెంచుకున్న జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ దారుణానికి ఒడిగట్టింది. ఆ సంస్థకు చెందిన ముష్కరుడు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. 2001లో జమ్మూకశ్మీర్ శాసనసభపై కారు బాంబు దాడి తర్వాత ఆ తరహా దాడి జరగడం ఇదే మొదటిసారి. ఈ దాడిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా రాజకీయ అగ్రనేతలంతా ఖండించారు. భద్రతా దళాల త్యాగాలు వృథాగా పోవని ప్రధాని స్పష్టం చేశారు. పుల్వామా జిల్లాలో శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై ఈ ఘాతుకం జరిగింది. గురువారం సాయంత్రం 3.15 గంటల సమయంలో 2500 మందికిపైగా సీఆర్పీఎఫ్ జవాన్లు 78 వాహనాల్లో జమ్మూ నుంచి బయలుదేరారు. సూర్యాస్తమయంలోగా వీరు శ్రీనగర్ చేరుకోవాల్సి ఉంది. వీరిలో అనేకమంది సెలవుల తర్వాత తిరిగి కశ్మీర్ లోయలో విధుల్లో చేరేందుకు వస్తున్నారు. శ్రీనగర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో అవంతిపురలోని లాతూమోడె వద్దకు వాహనశ్రేణి చేరుకోగానే పేలుడు పదార్థాలతో నిండిన ఒక స్కార్పియో వాహనం వేగంగా దూసుకొచ్చింది. కాన్వాయ్‌లోని ఒక బస్సును ఢీ కొట్టింది. ఫలితంగా బస్సు తునాతునకలైంది. ఈ వాహనంలో సీఆర్పీఎఫ్‌లోని 76వ బెటాలియన్‌కు చెందిన 39-44 మంది జవాన్లు ఉన్నారు. వారిలోని పలువురు అక్కడికక్కడే మరణించారు. పదుల సంఖ్యలో జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన శ్రీనగర్‌లో సైన్యానికి చెందిన ‘92 బేస్ ఆసుపత్రి’కి తరలించారు. చికిత్స పొందుతూ మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. కనీసం 39 మంది మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే బస్సులోని వారెవరూ బతకలేదని ఓ అధికారి చెప్పారు. ఆ వాహనంలో నిర్దిష్టంగా ఎంత మంది జవాన్లు ఉన్నారన్నది ఇంకా నిర్దారణ కాలేదని చెప్పారు. మృతదేహాలు తునాతునకలై, చెల్లాచెదురుగా పడ్డాయని దీనివల్ల మృతుల సంఖ్యను వైద్యులు నిర్దిష్టంగా చెప్పలేకపోతున్నారని వివరించారు. 42 మంది వరకూ మరణించి ఉండొచ్చన్నారు. పేలుడు శబ్దం కొన్ని కిలోమీటర్ల వరకూ వినిపించింది. పేలుడు తర్వాత తుపాకీ కాల్పులు చోటుచేసుకున్నాయని పోలీసులు చెప్పారు. దీన్నిబట్టి సమీపంలో కొందరు ఉగ్రవాదులు మాటువేసి కాల్పులు జరిపి ఉంటారని భావిస్తున్నారు. వాహనశ్రేణిలోని ఇతర వాహనాలూ దెబ్బతిన్నాయి. ఈ ఘటన జరిగిన వెంటనే భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు చర్యలు చేపట్టాయి.