మోదీ మాటలు.. అబద్ధాల మూటలు రాహుల్‌గాంధీ ధ్వజం

దిల్లీ: రఫేల్‌ ఒప్పందం వ్యవహారమై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. ‘ది హిందూ’లో వచ్చిన కథనాన్ని ఆధారంగా చేసుకొని ప్రశ్నలు సంధించారు. బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ‘‘రెండు కారణాలను చూపించి రఫేల్‌ ఒప్పందాన్ని ప్రధాని సమర్థించుకున్నారు. 1. సరసమైన ధర, 2. త్వరగా విమానాల అందజేత…ఈ రెండూ తప్పని తేలిపోయాయి. ఇది మెరుగైన ఒప్పందం కాదని ఫ్రాన్స్‌ ప్రభుత్వంతో బేరసారాలు నెరిపిన సంప్రదింపుల బృందంలోని సభ్యులే తేల్చిచెప్పారు. వారి లెక్కల ప్రకారం విమానాలను 55% ఎక్కువ ధరకు కొనుగోలు చేశారు. ధరలపై వివిధ సందర్భాల్లో ప్రధానిమోదీ, ఆర్థికమంత్రి జైట్లీ, రక్షణమంత్రి నిర్మలాసీతారామన్‌ పలు రకాలుగా చెప్పారు. ఈ నివేదికతో పోల్చిచూసినా ప్రభుత్వ పెద్దలంతా అబద్ధాలు చెప్పినట్లు తేలిపోయింది. వాయుసేనకు త్వరగా విమానాలు అందించడానికే రఫేల్‌ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రధాని చెప్పారు. అన్ని విమానాలు రావడానికి పదేళ్లు పడుతుందని తేలిపోయింది’’ అని అన్నారు ప్రభుత్వం తప్పులను కప్పిపుచ్చేదిగా ‘కాగ్‌’ నివేదిక ఉందని, అది విలువలేని కాగితం అని రాహుల్‌ విమర్శించారు. దాన్ని తాము పరిగణనలోకి తీసుకోవడం లేదని చెప్పారు. ‘‘నిపుణులు సమర్పించిన అసమ్మతి లేఖను కాగ్‌ పరిశీలించలేదు. ఈ పత్రాలను సుప్రీంకోర్టుకూ ఇవ్వలేదు. ఒక వేళ ఇచ్చి ఉంటే తీర్పు వేరుగా ఉండేది. పాత, కొత్త ఒప్పందాల ప్రకారం ఏ విమానం ధర ఎంతో నిర్దిష్టంగా చెప్పలేదు. బ్యాంకు గ్యారెంటీలు వద్దంటూ నిబంధనలు సడలించడాన్నీ కాగ్‌ ప్రశ్నించలేదు. ప్రత్యేక సౌకర్యాల కల్పన పేరుతో ధరల పెంపుదలనూ అడగలేదు.