మళ్లీ మెజారిటీ ఇవ్వండి సంపూర్ణ ఆధిక్యమున్న ప్రభుత్వం వల్లే ఇనుమడించిన దేశ ప్రతిష్ఠ ఆ ఘనత ప్రజలదే ప్రధాని మోదీ స్పష్టీకరణ
ప్రస్తుత ప్రభుత్వానికి ఓటర్లు ఇచ్చిన ఆధిక్యం కారణంగానే ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ఠ ఇనుమడించిందని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు బుధవారం లోక్‌సభలో ప్రధానమంత్రి 30 నిమిషాలపాటు తన చివరి ప్రసంగం చేశారు. రఫేల్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలు, కౌగిలించుకోవడం, కన్నుకొట్టడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ.. పార్లమెంట్‌కు తొలిసారి సభ్యుడినైన తనకు అవన్నీ కొత్త అనుభవాలని వ్యాఖ్యానించారు. రఫేల్‌పై సభలో తాను మాట్లాడితే ప్రకంపనలు వస్తాయంటూ గతంలో రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని గుర్తుచేస్తూ అలాంటిదేమీ సంభవించలేదని విమర్శించారు. ‘భూకంపం వస్తుందనే మాటను మనం విన్నాం. ఐదేళ్ల సభాకాలం ముగియడానికి వచ్చినా, అలాంటిదేమీ జరగలేదు’ అని ఎద్దేవా చేశారు. రఫేల్ ఒప్పందాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీలు సభలో కాగితం విమానాల్ని ఎగరేయడాన్ని ప్రస్తావిస్తూ ‘వారు విమానాల్ని ఎగరేసేందుకు ప్రయత్నించారు, కానీ మన బలమైన ప్రజాస్వామ్యం, లోక్‌సభ గౌరవం వాటిని సాగనివ్వలేదు, ఎలాంటి భూకంపమూ రాలేదు’ అని పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతున్నప్పుడు అట్టహాసాలు కూడా విన్నానన్నారు. స్పీకర్ సుమిత్రామహాజన్, కాంగ్రెస్ నేత మల్లికార్జునఖర్గే లోక్‌సభలో తమవైన పాత్రలు పోషించారని కితాబునిచ్చారు. ప్రస్తుత లోక్‌సభ నిర్వహించిన 17 సెషన్లలో ఎనిమిది వందశాతంపైగా ఫలవంతమయ్యాయని పేర్కొన్నారు. మొత్తంగా సభ 85 శాతం ఫలవంతంగా సాగిందన్నారు. ఇంతకుముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రులుగా సేవలు అందించిన వెంకయ్యనాయుడు, అనంతకుమార్‌ల పనితీరును ప్రశంసించారు. స్పష్టమైన ఆధిక్యంలేని ఎన్నికల ఫలితాల వల్ల దేశం ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు పడిందని, కానీ, ప్రస్తుతం మెజారిటీతో కూడిన ప్రభుత్వం వల్ల భారత్‌ను అందరూ పట్టించుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ఠ పెరగడానికి తానుగానీ, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌గానీ కారణం కాదని, మూడు దశాబ్దాల తర్వాత లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీతో ఏర్పడిన ప్రభుత్వానిదేనని, ఈ ఘనత దేశ ప్రజలకే చెందుతుందన్నారు. భారతదేశ ఆత్మవిశ్వాసం పెరిగిందని, విభిన్న పరామితుల్లో మెరుగుదల నమోదైందన్నారు. తమ ప్రభుత్వ విజయాలను ప్రస్తావిస్తూ.. భారత్ 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని, సుమారు రూ.360 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ దిశగా సాగుతోందన్నారు. ప్రపంచం భూతాపం గురించి చర్చిస్తోందని, భారత్ అంతర్జాతీయ సౌర కూటమిని ఏర్పాటుకు కృషి చేయడం ద్వారా ఈ సమస్యను తగ్గించేందుకు తోడ్పడిందన్నారు. ప్రస్తుత లోక్‌సభలో అవినీతి, నల్లధనం నిరోధకానికి కఠినమైన చట్టాల్ని ఆమోదించడం జరిగిందని, జీఎస్టీని కూడా ఆమోదించిందని, ఈ ప్రక్రియ సహకార స్ఫూర్తిని వెల్లడించిందని వ్యాఖ్యానించారు. 16వ లోక్‌సభలో అత్యధిక సంఖ్యలో మహిళా ఎంపీలు ఉన్నారని పేర్కొన్నారు. భద్రతపై కేబినెట్ కమిటీలో కూడా ఇద్దరు మహిళా సభ్యులు ఉన్నారన్నారు. డిజిటల్ పటంపై భారత్ తనదైన ముద్ర వేసిందన్నారు. 16వ లోక్‌సభలో 219 బిల్లులు ప్రవేశపెట్టగా, 203 బిల్లులకు ఆమోదం లభించిందని, అందులో నల్లధనాన్ని నిరోధించే బిల్లుకూడా ఒకటని వెల్లడించారు. వాడుకలో లేని 1400 చట్టాల్ని సభ రద్దు చేసిందన్నారు. విదేశాల్లో నల్లధనం, బినామీ ఆస్తులు, జీఎస్టీ బిల్లుల్ని సభ ఆమోదించిందని తెలిపారు. బంగ్లాదేశ్‌తో ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న సరిహద్దు వివాదం పరిష్కారం, ఆర్థికంగా బలహీన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన అంశాన్ని ప్రస్తావించారు.
2022 నాటికి అందరికీ ఇళ్లు: మోదీ
2022 నాటికి అందరికీ గృహవసతి కల్పించాలనే లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆయన బుధవారమిక్కడ స్థిరాస్తి సదస్సులో మాట్లాడుతూ.. 1.5 కోట్ల గృహాల్ని పేదల కోసం నిర్మించినట్లు తెలిపారు. గృహ కొనుగోలుదారులకు, అద్దెదారులకు ప్రోత్సాహకాలు కల్పించిన మధ్యంతర బడ్జెట్ గృహనిర్మాణ రంగానికి ఎంతో తోడ్పడుతుందని వెల్లడించారు. బడ్జెట్‌లో ఇచ్చిన పలు మినహాయింపులు స్థిరాస్తి రంగానికి ఊతమిస్తాయన్నారు. నోట్లరద్దు ఈ రంగంలో నల్లధనాన్ని అరికట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లలో స్థిరాస్తి రంగంలో సానుకూల మార్పులు తెచ్చేందుకు కృషి చేసినట్లు వివరించారు. తెదేపా ఎంపీ శివప్రసాద్ వేషధారణ చూసినప్పుడల్లా సభ్యులకు ఒత్తిడి తగ్గిపోయేదని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. బుధవారం లోక్‌సభ ప్రసంగంలో శివప్రసాద్ వేషధారణలను ప్రధాని ప్రస్తావించారు. ‘‘ఈ సారి ఉభయ సభల్లో చాలామంది కళాకారులు ఉన్నారు. వారి ప్రతిభ కూడా ఎంతో అనుభవాన్నిచ్చింది. నేను ప్రస్తుతం తెదేపాతో కలిసి లేను. కానీ, అలాంటి వేషధారణలతో తెదేపా సభ్యుడు శివప్రసాద్‌ను సభలో చూశా. చాలా అద్భుతమైన వేషధారణలు వేసుకొచ్చారు. నవ్వు, కోపాల మధ్యే ఈ సభ కాలం గడిచిపోయింది. మీ అందరినీ చూసి చాలా నేర్చుకున్నా. అందరికీ ధన్యవాదాలు’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.