ఎన్నికలకు ముందే జాతీయ జట్టుగా బరిలోకి

దిల్లీ: కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమిని ఓడించేందుకు ఎన్నికలకు ముందే ప్రజాకూటమిగా ఏర్పడాలనే నిర్ణయానికి వచ్చాయి. కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ) ద్వారా సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించాయి. సీఎంపీ ముసాయిదా రూపకల్పన బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేతృత్వంలోని బృందానికి అప్పగించాయి. దిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ నివాసంలో విపక్ష నేతలు సుదీర్ఘంగా సమావేశం జరిపి ఎన్నికల వ్యూహరచనపై చర్చించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఫరూఖ్‌అబ్దుల్లా పాల్గొన్న ఈ సమావేశం అనుకోకుండా జరిగింది. దిల్లీ సీఎం

అరవింద్‌ కేజ్రీవాల్‌ నిర్వహించిన సత్యాగ్రహ సభలో విపక్ష నేతలంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మోదీ పాలనను తూర్పారబట్టారు. అనంతరం మర్యాదపూర్వకంగా శరద్‌పవార్‌ ఇంటికి వెళ్లి సమావేశమయ్యారు. అక్కడ భవిష్యత్తు కార్యాచరణ గురించి సమాలోచనలు జరిపే సమయంలో రాహుల్‌గాంధీ కూడా ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవడంతో వెంటనే చంద్రబాబునాయుడు రాహుల్‌గాంధీకి ఫోన్‌ చేసి విషయం చెప్పారు. మీరు కూడా ఇందులో పాల్గొంటే బాగుంటుందని కోరడంతో తర్వాత రాహుల్‌ కూడా వచ్చి చర్చల్లో పాల్గొన్నారు. దిల్లీ, కోల్‌కతాల్లో ప్రత్యర్థులుగా ఉన్న ముఖ్యమంత్రులు అరవింద్‌కేజ్రీవాల్‌, మమతాబెనర్జీలతో రాహుల్‌గాంధీ కలిసి కూర్చోవడం ఇదే తొలిసారి. ఎన్నికల అనంతరం ఇబ్బందులు లేకుండా ముందస్తు పొత్తులు పెట్టుకోవడంతోపాటు, సీఎంపీ ద్వారా ఎన్నికలకు వెళ్తే ప్రజలకు భరోసా ఇవ్వడంతోపాటు, భవిష్యత్తు విధానాలను ప్రకటించినట్లవుతుందనే భావనకు వచ్చారు. భారత ప్రజాస్వామ్యం, వ్యవస్థలపై మోదీ, అమిత్‌షా, ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్నదాడులను అడ్డుకోవడమే మా అందరి ముఖ్యలక్ష్యం. అందరూ చర్చించుకొని కనీస ఉమ్మడి కార్యక్రమానికి రూపకల్పన చేయాలని నిర్ణయించాం. ఆ చర్చలు ఇప్పుడు మొదలవుతాయి. భాజపాను ఓడించేందుకు అందరూ కలిసికట్టుగా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అని స్పష్టంచేశారు. కనీస ఉమ్మడి కార్యక్రమం ఆధారంగా పని చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. మోదీ, అమిత్‌షా ప్రభుత్వాన్ని ఓడించి ప్రజాపాలనను తీసుకురండి అనే నినాదంతో ప్రజల ముందుకెళ్తాం. దేశాన్ని సర్వనాశనం చేసిన ఈ ప్రభుత్వం మనకు అవసరం లేదు. అలాంటి వారిని ఓడించేందుకు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుకుంటున్నారు. అంతా కలిసి పనిచేయడంపై నిర్మాణాత్మక చర్చలు జరిగాయి. అతి త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ఖరారు చేస్తాం అని ప్రకటించారు. ఇప్పటిదాకా ఈ అంశాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తదుపరి సమావేశంలో తుది నిర్ణయానికి వస్తామన్నారు. జాతీయ స్థాయిలో ఒక వేదిక ఏర్పాటు చేసి భాజపాకు ప్రత్యామ్నాయం చూపాలనే లక్ష్యంతో తాము పని చేస్తున్నట్లు వివరించారు. భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వం భారత్‌ను సమైక్యంగా ఉంచడంతోపాటు, దెబ్బతిన్న వ్యవస్థలను సరిదిద్దాలన్నదే మా లక్ష్యం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. భావసారూప్య పార్టీలన్నీ జాతీయ స్థాయిలో కలిసి పని చేయాలని నిర్ణయించాం. రాష్ట్రస్థాయుల్లో రాజకీయ ఇబ్బందులుంటే వాటిని స్థానికంగా పరిష్కరించుకుంటాం. ప్రజాస్వామ్యం, లౌకికతత్వాన్ని నిలబెట్టేందుకు మేమంతా ఒక్కటిగా ఉంటాం. దేశాన్నిరక్షించి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడమే మా అంతిమ లక్ష్యం అని స్పష్టం చేశారు. జాతీయస్థాయిలో మాత్రం అందరూ కలిసి పని చేయాలనే నిర్ణయానికి వచ్చాం. భాజపాను ఓడించేందుకు కలిసి పనిచేస్తామన్నారు. ఈ సమావేశంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ లోక్‌సభా పక్షనేత సుదీప్‌ బందోపాధ్యాయ, ఎన్సీపీ నేత ప్రఫుల్‌పటేల్‌, ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌, దిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు కూడా పాల్గొన్నారు.

దేశ వ్యాప్తంగా సమావేశాలు
దేశ ప్రజలందరిలో కూటమిపై విశ్వాసం కలిగించేందుకు దేశంలోని విభిన్న ప్రాంతాల్లో కూటమి సమావేశాలు నిర్వహించాలనే అభిప్రాయానికి విపక్ష నేతలు వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం పౌరసత్వ బిల్లు విషయంలో ఈశాన్య రాష్ట్రాల ప్రజల్లో ఆందోళన నెలకొని ఉన్నందున తదుపరి సమావేశం ఈశాన్య రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. అదేవిధంగా దక్షిణాదిలో కూడా మరోసారి భేటీ జరపాలనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.