మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదం
రాష్ట్ర చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. శ్రావణ శుక్రవారం పర్వదినం ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి శుభ సంకేతాన్ని అందించింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా ప్రాంతీయ సమానాభివృద్ధి దిశగా అతిపెద్ద ముందడుగు పడింది. మూడు రాజధానుల వ్యవస్థతో ప్రాంతీయ సమానాభివృద్ధి సాధించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మక విధాన నిర్ణయం రాజ్యాంగ ప్రక్రియను పూర్తి చేసుకుంది. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం ఆమోదించారు. రాష్ట్రంతో పాటు జాతీయ స్థాయిలోనూ తీవ్ర ఆసక్తి కలిగించిన ఈ బిల్లులపై గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారా అన్న ఉత్కంఠతకు ఎట్టకేలకు తెరపడింది. ఆ బిల్లులను అన్ని కోణాల్లో పరిశీలించి, న్యాయ నిపుణులతో చర్చించి, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకున్న అనంతరం గవర్నర్ ఆమోదముద్ర వేశారు. దీంతో విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని… అమరావతిలో శాసన రాజధాని… కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు మార్గం సుగమమైంది.