అసలైన ఆనందానికి చిరునామా
ఆనందం ఎవరుకోరుకోరూ! కానీ ఎంత మూల్యానికి? ప‌్రతి మనిషీ ప్రతిరోజూ, ప్రతి క్షణం ఆనందం కోసం వెదుకుతూ ఉంటాడు. సినిమాలు, టీవీ సీరియల్స్ చూడటం వల్ల ఆనందం వస్తుందా? విహార యాత్రలకు వెళితే ఆనందం వస్తుందా? పెళ్లి చేసుకున్నప్పుడు, కొత్త కారు కొన్నప్పుడు, మంచి బంగళా కట్టుకున్నప్పుడు ఆనందం వస్తుందా? ఉద్యోగంలో ప్రమోషన్ లేదా వ్యాపారంలో అనూహ్యంగా లాభాలు వస్తే ఆనందం వస్తుందా? ఇలా ఒక కారణం చేత బాహ్య పరిస్థితుల వల్ల వచ్చేది నిజంగా ఆనందమేనా? ఖచ్చితంగా కాదు. ఇది కేవలం కొద్దిపాటి సంతోషం మాత్రమే. ఈ సంతోషం క్షణికం. కొద్ది నిమిషాలు, కొన్ని రోజులు మాత్రమే మనలో ఉండి వెళ్లిపోతుంది. చాక్లెట్ చప్పరిస్తూ ఉంటే ఆ మధురిమ మనలో ఎంతసేపు ఉంటుంది ? కొద్ది క్షణాలు మాత్రమే ఉంటుంది. అలాగే సంతోషం కూడా. సంతోషం ప్రతి మనిషికి అవసరమే కానీ సంతోషాన్ని కంటే వేల రెట్లు ఆనందంలో ఉంటుంది. ఆనందం అన్నది నిరంతరం ప్రవహించే గంగా నదిలాంటిది. ఆనందం ఎంత మధురంగా ఉంటుందో వర్ణించలేము. ఆనుభవిస్తే కాని ఆనందామృతపు విలువ తెలియదు. అన్నమయ, రామదాసు, రామకృష్ణ పరమహంస మొదలైన భక్తులు దైవరాధనలో పారవశ్యులై ఈ పరమానందాన్ని సచ్చిదానందాన్ని, బ్రహ్మానందాన్ని చవిచూశారు.
“అమ్మో ఆనందం కావాలంటే గొప్ప భక్తులం అయిపోవాలా? ఈ ఉద్యోగాల్లో, వ్యాపారంలో, సంసార జీవితంలో ఎంతో ఒత్తిడికి లోనవుతూ నానా కష్టాలు పడుతుంటే భక్తులం అయిపోవాలా? ఇది నా వల్ల సాధ్యపడదు” అని నిరుత్సాహాపడకండి. చాలా సుళువైన పద్దతులలో ఈ ఆనందాన్ని అస్వాదించే మార్గాలు ఉన్నాయి.
ఒక్కసారి చిన్న పిల్లల్ని చూడండి. వాళ్లు ఎప్పుడూ కల్లా కపటాలు లేకుండా ఆనందంగా ఆటపాటల్లో మునిగి తేలుతుంటారు. మనం ఇప్పుడు చిన్నపిల్లలం అవ్వలేము కానీ ఆ పసి హృదయాల నిర్మలత్వం మనలో పెంపొందించుకుంటే చాలు ఆనందం మనకు లభిస్తుంది. ” The real happiness comes when you make others happy” నీతోటి మనుషుల్ని సంతోషపరిస్తే, నీకు ఆనందం కలుగుతుంది. కరోనా మహమ్మారి బారిన పడి ఆకలితో కొట్టుమిట్టాడుతున్న అభాగ్యులకు నీ శాయశక్తులా సహాయపడిప్పుడు ఆనందం నీ వెంటే ఉంటుంది. నేను, నాది అనే సంకుచిత్వాన్ని విడిచిపెట్టి మనము, మనది అనే విశాలత్వాన్ని అలవరచుకుంటే నీలో ఆనందం వెల్లివిరుస్తుంది.
ఆనందానికి చిరునామా బయటలేదు. నీ అంతరంగంలో ఉంది. నీ అంతరంగం కల్మషాలతో, కుఠిలత్వంలో నిండివుంటే, నీవొక లంచగొండివైతే మాటలలో చేతలతో తోటివారిని హింసించే గుణం నీలో ఉంటే ఆనందం నీకు దుర్లభం. దైవీ గుణాలైన ప్రేమా, దయ, కరుణ, క్షమాగుణం, పవిత్రత, కృతజ్ఞత మొదలైనవి నీలో అలవరుచుకుంటే ఆనందమకరందం నీ స్వంతమవుతుంది. ప్రతిరోజూ కొంతసేపు ధ్యాన, జ్ఞాన అభ్యాసాల వలన ఆనందం నీలో దేదీప్యమానంగా ప్రజ్వరిల్లుతుంది. నిన్ను ఆనంద పారవశ్యంలో ముంచెత్తుతూ నీ జీవితాన్ని సార్థకం చేస్తుంది.
Author : JYOTSNA, LifeCoach
Follow FB Page BestLifecoach (FOR MORE UPDATES)
Courtesy www.DigitalCosmos.Biz