మీకు దండం పెడ్తా.. ఆ పని మాత్రం చెయ్యకుండ్రి..!
తెలంగాణ అంటే తెరాస, తెరాస అంటే తెలంగాణ’ అనేలా మారిపోయింది.. గత డిసెంబర్ తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాలను కోలుకోలేని దెబ్బ కొట్టిన కేసీఆర్ మరోసారి కుర్చీనెక్కి దిట్టంగా కూర్చున్నారు. తర్వాతొచ్చిన పంచాయతీ ఎన్నికల్లో సైతం అదే తరహా జయభేరి మోగడంతో ‘తెలంగాణ మనదే’నని ఫిక్స్ అయిపోయింది తెరాస క్యాడర్. గులాబీ పార్టీ లీడర్లు కూడా అదే జోష్‌లో వున్నారు. ఏ ఒక్క సందర్భం దొరికినా సెలబ్రేట్ చేసుకోడానికి సిద్ధంగా వున్నారు.
ఈ క్రమంలోనే.. పార్టీ అధినేత, తమ దేవుడు కేసీఆర్ పుట్టిన రోజొచ్చేసింది. ఈనెల 17తో ఆయనకు 64 నిండుతాయి. ఈ నేపథ్యాన్ని టీఆరెస్ శిబిరం సెలబ్రేట్ చేసుకోకుండా ఎలా ఉంటుంది? వీళ్ళ ఆశల మీద నీళ్లు జల్లేశాడు తెరాస యువరాజు కేటీఆర్. ‘మన ముఖ్యమంత్రి పుట్టినరోజు వస్తోంది. పార్టీ వర్కర్లు, లీడర్లు అనవసర ఆర్భాటం చేసి డబ్బు వృధా చేయకండి. మనమంతా తలో మొక్క నాటి మన నాయకుడి మీద అభిమానాన్ని చాటుకుందాం’ అంటూ ట్వీట్ చేశారు. చేతులెత్తి మొక్కుతున్నానంటూ ఒక ఎమోజీ కూడా పోస్ట్ చేశారు. కానీ.. ఊపుమీదున్న గులాబీ దళం.. ఈ సున్నితమైన హెచ్చరికను ఖాతరు చేస్తుందా..? దారెమ్మట కటౌట్లు, ఫ్లెక్సీలు, పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్స్‌తో రెగ్యులర్‌గా చేసే హల్చల్ ఈసారి మాత్రం చెయ్యకుండా ఉండిపోతారా? ఒకవేళ అదే జరిగితే.. జనంలో నిజంగా మార్పు వచ్చినట్లు ఒప్పుకుని అభినందించి తీరాల్సిందే!