ఈటల స‌మావేశంలో కరోనా కలకలం

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నిర్వహించిన స‌మావేశంలో కరోనా కలకలం రేగింది. ఆ స‌మావేశానికి హాజరైన ఎమ్మెల్యే గ‌న్‌మెన్‌ల‌కు, ఆయన సన్నిహితులకు కరోనా పాజిటివ్ గా తేలింది. వాళ్లంతా ఇప్పటికే పలు మీటింగుల్లో పాల్గొనడంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా పరిస్థితులు, సీజనల్ జబ్బులపై మంగళవారం హన్మకొండ హంటర్ రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్ లో మంత్రులు ఈటల, ఎర్రబెల్లి దయాకర్ రావులు సమీక్ష నిర్వహించారు. ఆ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, డీఎంహెచ్వోలు, ఇతర ఆఫీసర్లు హాజరయ్యారు. సమావేశానికి వచ్చిన వారికి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు యాంటీజెన్ టెస్టులు చేశారు. ఎమ్మెల్యేల గ‌న్‌మెన్‌లు, సన్నిహితులు 25 మందికి టెస్టులు చేశారు. అందులో ఆరుగురికి పాజిటివ్ తేలింది. పాజిటివ్ వచ్చినోళ్లంతా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గ‌న్‌మెన్‌లకు, సన్నిహితులే. ఆయన ఇద్దరు గన్మెన్లకు పాజిటివ్ రాగా, అందులో ఓ గన్మెన్ తన భార్య, కూతురికి
టెస్ట్ చేయించగా వాళ్లకూ వైరస్‌ సోకింది. గండ్ర పర్సనల్ ఫొటోగ్రాఫర్ తో పాటు ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉండే మరో వ్యక్తికీ సోకినట్టు వరంగల్ అర్బన్ డీఎంహెచ్వో లలితాదేవి నిర్ధారించారు. వాళ్లంతా ఇప్పటికే పలు మీటింగుల్లో పాల్గొనడంతో.. ఆ మీటింగులకు వెళ్లిన వాళ్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు టెస్టులు చేయించుకున్నళ్లెవరూ మీటింగ్లో పాల్గొనలేదని, అంతా టెస్టులు చేయించుకుని వెళ్లిపోయారని లలితాదేవి చెప్పారు. వాళ్లకు ఉదయమే టెస్టులు చేయించాలని గండ్ర అనుకున్నా మీటింగ్ కు ఆలస్యమవుతోందని సమీక్ష జరిగిన గార్డెన్ లో టెస్టులు చేయించినట్టు వివరించారు.