గూనిని నయం చేసిన కిమ్స్ కొండాపూర్ వైద్యులు
జీవితాంతం వైకల్యంతో బాధపడాల్సిన ఆరేళ్ల గ్రీష్మికకు కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రి వైద్యులు కొత్త జీవితాన్ని ఇవ్వడంతో ఆమె కుటుంబ సభ్యులు ఎంతగానో ఊరట పొందారు. ఆ చిన్నారిని ఈ ఏడాది మార్చి నెలలో ఆమె తల్లిదండ్రులు కిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పుట్టినప్పటి నుంచి ఆమెకు వెన్నెముకలో వైకల్యం ఉంది. పాపను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, ఆమెకు పుట్టుకతోనే గూని ఉందని వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ కె. శ్రీకృష్ణ చైతన్య గుర్తించారు. ఇది చాలా సంక్లిష్టమైన కేసు కావడం, బాలికకు ఒకసారి కాకుండా పలుమార్లు శస్త్రచికిత్సలు చేసి, ఆమెకు 13 ఏళ్ల వయసు వచ్చేవరకు రాడ్ ను పొడిగిస్తూ పోవాలి. వెన్నెముక ఎదుగుదలతో పాటే రాడ్ పొడవు కూడా పెంచాలి. అప్పుడే సమస్య పూర్తిగా నయమవుతుంది. సాధారణంగా ప్రతి 2వేల మందిలో ఒకరికి ఇలా పుట్టుకతోనే గూని వస్తుంది. ఐదేళ్ల లోపు పిల్లలకు ఇది రావడం వల్ల వాళ్ల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుంది.
ఈ కేసు గురించి కిమ్స్ కొండాపూర్ ఆసుపత్రి వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ కృష్ణచైతన్య మాట్లాడుతూ, ‘‘ఇది చాలా సంక్లిష్టమైన, కష్టమైన శస్త్రచికిత్స. బాలికకు ఉన్న వైకల్యం దృష్ట్యా శస్త్రచికిత్స మాత్రమే చేయాల్సి ఉంది. గూని కారణంగా గ్రీష్మిక సరదాగా డాన్సు చేద్దామన్నా, ఈత కొడదామన్నా, నీళ్లలో ఆడుకుందామన్నా కుదిరేది కాదు. దాంతో చిన్నచిన్న ఆనందాలకూ ఆమె దూరమైంది. దాంతో ఆమెకు గ్రోయింగ్ రాడ్ వేయాల్సి వచ్చింది. పాపకు 13 ఏళ్ల వయసు వచ్చేవరకు ఆమె ఎదుగుదలకు ఇది అత్యవసరం.
ఈ సమస్య ఉండటం వల్ల పాప ఒకవైపు అంతా వంగినట్లుండి.. పొట్టిగా అయ్యి, ఊపిరితిత్తులు ముడుచుకుపోయి ఊపిరి అందని పరిస్థితి ఏర్పడింది. పుట్టుకతోనే ఆమెకు ఈ వైకల్యం వచ్చింది. కుడివైపు వంకరగా ఉండి, దానివల్ల ఊపిరితిత్తులు కూడా సరిగా లేకపోవడం వల్ల తరచు జలుబు, దగ్గు, అలసట లాంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఎడమవైపు ఊపిరితిత్తులు వ్యాకోచించడానికి అవకాశం లేదు. గుండెకు, ఊపిరితిత్తులకు తగినంత స్థలం ఉండదు. కొద్దిసేపు ఆడుకున్నా వెంటనే అలసట వస్తుంది.
ఎడమవైపు గుండె, ఊపిరితిత్తులు ముడుచుకుపోయాయి. దీనివల్ల ఎదుగుదల ఉండదు, ఆహారం కూడా సరిగా తీసుకోలేరు. శస్త్రచికిత్స చేయకపోతే ఎదుగుదల ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుంది.
అమ్మాయికి సమస్య ఉందని ఆమెకు మూడేళ్ల వయసులో తెలిసింది. పాపకు రెండున్నర – మూడేళ్లకు నడక వచ్చింది. అప్పుడు నడకలో కొంత వంకర ఉందని తల్లిదండ్రులు గుర్తించారు. అప్పటి నుంచి పిల్లల వైద్యులకు, జనరల్ ఫిజిషియన్లకు చూపించారు. వాళ్లు మందులు ఇస్తూ కొంత వాయిదా వేశారు. ఐదో సంవత్సరంలో ఇక శస్త్ర చికిత్స చేయిద్దామని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. కానీ తర్వాత డబ్బులు సర్దుబాటు చేసుకుని, ఆసుపత్రికి వచ్చేసరికి 6-8 నెలలు పట్టింది.
ఇక్కడ మేం టెలిస్కోపిక్ రాడ్స్ వాడాం. దీనివల్ల ఎప్పటికప్పుడు పాప ఎదుగుదలను అంచనా వేసుకుంటూ రాడ్ ను పొడిగించడం వీలవుతుంది. చిన్నపాటి సర్జరీలు చేసి రాడ్ పొడిగిస్తాం. ప్రత్యేకమైన పరికరాలు వాడటం వల్ల ఉదయం వచ్చి, మధ్యాహ్నం చేయించుకుని, సాయంత్రం వెళ్లిపోవచ్చు. దాదాపు 13-14 ఏళ్ల వయసు వరకు దాదాపు ప్రతి యేటా చేయాలి’’ అని వివరించారు.
‘‘ మొదటి శస్త్ర చికిత్సను 2019 మార్చి నెలలో చేశాం. అందులో డి3/డి4, ఎల్3/ఎల్4 వద్ద యాంకర్ స్క్రూలు బిగించాం. రెండో శస్త్ర చికిత్సను ఈ నెలలోనే చేసి, ఆ స్క్రూలను కొంత విస్తరించాం. మొదటి శస్త్రచికిత్సకు 6 గంటల సమయం పట్టింది. రాడ్లు, స్క్రూలు వేసి వెన్నెముకను సరిచేశాం. ఇందుకోసం మేం ఇంట్రా ఆపరేటివ్ న్యూరల్ మానిటరింగ్, 3డి ప్రింటింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించాం. మత్తువైద్య నిపుణుల బృందం సాయంతో విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తయింది. చిన్న వయసులో గుర్తిస్తే పిల్లల్లో ఇలాంటి వైకల్యాలను అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో చాలా చక్కగా నయం చేయొచ్చు. ఇలాంటి శస్త్రచికిత్సలు చేయాలంటే సరైన మౌలిక సదుపాయాలు ఉండే అత్యుత్తమ ఆసుపత్రులు, బాగా నిపుణులైన వైద్యుల బృందం ఉండాలి, వాళ్లకు బోలెడంత సహనం, పట్టుదల, బృందంగా పనిచేసే తత్వం ఉండాలి’’ అని ఆర్థోపెడిక్, స్పైన్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ అన్నే సాయిలక్ష్మణ్ తెలిపారు.
బాలికకు శస్త్రచికిత్స చేసిన బృందంలో స్పైన్ సర్జన్ డాక్టర్ కె. శ్రీకృష్ణ చైతన్య, ఆర్థోపెడిక్, స్పైన్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ అన్నే సాయిలక్ష్మణ్, ట్రామా అండ్ ఆర్థ్రోస్కొపీ సర్జన్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సీఆర్ సురేష్ బాబు, మత్తువైద్య నిపుణుల బృందం ఉన్నారు.