మానవత్వం లేని మహిమగల దేవుడు
జూలై నెల వస్తుంది అంటే పల్లెలో ఆనందమే… వానల పులకింతతో పైరులన్ని పచ్చగా ఉంటాయి, రైతన్న కుటుంబాలలో ఎదో తెలియని ఆనందమే కానీ గత ఆరేళ్లుగా ఏళ్లుగా ఆ పచ్చని పల్లెలు మూగబోతున్నాయి. ఆ ఇళ్లలో ఎక్కడ లేని నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. పేగు తెంచుకున్న బిడ్డలు పంట చేలలోని మట్టిలో చెదలు పట్టి పోయినా ఆ జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఇంకా ఆ బిడ్డలు బుడి బుడి అడుగులు వేస్తూ… అమ్మా, నాన్న, నాన్నమ్మ , తాతా అంటూ పిలుస్తున్నారు అనే ద్యాసలోనే ఉన్నారు. పాపం వారికేమి తెలుసు మానవత్వం లేని మహిమగల దేవుడు వారిని లోకం పోకడ తెలియకముందే తీసుకెళ్తాడు అని.
కంటి నిండా నిదుర కూడా పోకుండానే … లే అమ్మ … నా బంగారు తల్లి… లేచి రెడీ అయి స్కూల్ కి వెళ్ళు అంటూ అమ్మ. నాన్న లేరా త్వరగా రెడీ అవు స్కూల్ బస్సు వస్తుంది అంటూ నాన్న. ఇలా తమ పిల్లల్ని నిదుర లేపి శాశ్వత నిదురలోకి పంపుతారని ఆ కన్నా పేగుకు కూడా తెలియదు కదా. ఎన్నో మహిమహాలు ఉన్న ఆ దేవుడు వారి మనసును ఎందుకు మార్చలేవయ్యా. ఆ ఒక్క రోజు బడికి పంపకుండా ఆ పిల్లల్ని ఎందుకు అపలేదయ్యా. ఆ పసి ప్రాణాల బరువే నీకు భారం అయిందా ? లేక ఆ ప్రాణాల బరువు మోయడం నీకు చేతకాలేదా దేవుడా.
ఇసుక పచ్చిగా ఉందని ఇంటి ముందు పిట్టగూళ్ళు కట్టుకున్న ఆ జ్ఞాపకం మరవకముందే… అల్లారు ముద్దుగా పెంచిన జ్ఞాపకాలను తుడిచేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది అయ్యా. నాన్నమ్మ పెట్టిన గోరు ముద్దలు తిని, తాతా చెప్పిన కథలు విని పడుకొని లేచి .. ఆ కథలు తోటి మిత్రులకు చెప్పుకోక ముందే రక్తపు మడుగుల గురించి ఈ ప్రపంచం అంత మాట్లాడుకునేలా చేశావు కదా దేవుడా. ఇది నీకు ఏలా న్యాయం అనిపించింది దేవుడా ?.
మాసాయిపేట రైలు ప్రమాదాన్ని గుర్తు చేసుకుంటూ ….
శ్రీ