‘12 గంటల దీక్షకు 11 కోట్లు ఖర్చు’ నిజానిజాలేంటి?

ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిల్లీలో ధర్మపోరాట దీక్ష చేశారు. ఫిబ్రవరి 11న ఉదయం 8గంటలకు ప్రారంభమైన ఈ దీక్ష రాత్రి 8 గంటలకు ముగిసింది. ఈ 12 గంటల దీక్ష కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11.12 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇది ప్రభుత్వ కార్యక్రమం అని టీడీపీ చెబుతోంటే, ఇది రాజకీయ కార్యక్రమం అని, ఇలాంటి కార్యక్రమానికి 11 కోట్ల ప్రజాధనాన్ని కేటాయించడం ఏమిటని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. నిజంగానే ఏపీ ప్రభుత్వం ఒక్కరోజు దీక్షకు 11.12 కోట్ల రూపాయలను కేటాయించిందా? ఇందులో నిజానిజాలేంటి?దిల్లీలో ఫిబ్రవరి 11న జరిగిన దీక్ష ఖర్చుల కోసం 10 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ఫిబ్రవరి 6న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ జీఓ నెంబర్ 215ను విడుదల చేసింది. సాధారణ పరిపాలన విభాగం నుంచి వచ్చిన ఫైలు ఆధారంగా, అందులో పేర్కొన్న మేరకు ఈ మొత్తాన్నివిడుదల చేస్తున్నామని వివరించింది.