కశ్మీర్‌లో భారీ మారణహోమానికి పాక్ ప్రయత్నం
భారత్‌లో మరో మారణహోమానికి పాకిస్తాన్ కుట్ర పన్నింది. ఆర్టికల్ 370 రద్దై ఏడాది పూర్తి కావొస్తున్న తరుణంలో జమ్మూకాశ్మీర్లో అలజడి రేపేందుకు పెద్ద ఎత్తున మారణాయుధాలతో టెర్రరిస్టులను పంపుతోంది. శనివారం తెల్లవారుజామున ఇద్దరు టెర్రరిస్టులు ఏకే–47 తుపాకులు, పెద్ద సంఖ్యలో బుల్లెట్లు, చైనా తయారీ హ్యాండ్ గన్స్, ఆస్ట్రియా టెక్నాలజీతో పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారైన హ్యాండ్ గ్రెనేడ్లతో కుప్వారా జిల్లా వద్ద గల ఎల్వోసి బోర్డర్‌ను దాటారు. దాదాపు వంద మీటర్లు లోపలికి వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులను సిక్కు లైట్ ఇన్ఫాంట్రీకి చెందిన సైనికులు మట్టుబెట్టినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. టెర్రరిస్టులు ఇద్దరిలో ఒకరిని కుప్వారాకు చెందిన ఇద్రిస్ అహ్మద్ భట్(23)గా గుర్తించినట్లు తెలిపారు. 2018లో ఇద్రిస్ పాకిస్తాన్ వెళ్లాడని వివరించారు. ఇరువురూ లష్కర్ ఈ తోయిబాకు చెందిన ఉగ్రవాదులుగా భావిస్తున్నట్లు వెల్లడించారు. ఐఎస్ఐ ప్రోద్భలంతో ఉగ్రవాదులు చైనాకు చెందిన డ్రోన్లతో ఆయుధాలు స్మగ్లింగ్ చేస్తారనే సమాచారంతో ఎల్వోసీ వద్ద ముందుస్తుగా నిఘాను పెంచినట్లు భారత ఆర్మీ అధికారి మేజర్ జనరల్ వీరేంద్ర పేర్కొన్నారు. ఫెన్సింగ్ కట్ చేసి కాశ్మీర్‌లోకి చొరబడిన టెర్రరిస్టులను సైనికులు అడ్డుకున్నట్లు చెప్పారు.
పార్లమెంటుపై దాడిలో ఇవే గ్రెనేడ్లు
2001లో ఇండియా పార్లమెంటుపై జైషే ఈ మహమ్మద్ చేసిన ఉగ్రదాడిలో వాడిన గ్రెనేడ్లు, శనివారం టెర్రరిస్టుల వద్ద లభించిన గ్రెనేడ్లు ఒకే రకానికి చెందినవి. వీటితో 20 మీటర్ల పరిధిలో ఉన్న అందరినీ చంపొచ్చు. చైనా నుంచి అందుకున్న డ్రోన్లతో పాకిస్తాన్ పంజాబ్‌లోకి డ్రగ్స్, ఆయుధాలను పంపుతోంది. దీంతో సరిహద్దుల్లో డ్రోన్లను కూల్చివేసే యాంటీ డ్రోన్ సిస్టమ్స్‌ను మోహరించేందుకు భారత ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం.