చైనా, పాక్‌ల‌కు ‘బిజినెస్‌’ బంద్‌‌!

సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా నుంచి భారత్‌ విద్యుత్‌ పరికరాలను దిగుమతి చేసుకోబోదని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ స్పష్టం చేశారు. అలాగే, చైనా, పాకిస్తాన్‌ల నుంచి వచ్చే పరికరాల దిగుమతులను కేవలం తనిఖీల ఆధారంగా అనుమతించేది లేదని పేర్కొన్నారు. తనిఖీల తర్వాతైనా అవసరమైతే అనుమతులు రద్దు చేస్తామన్నారు. రాష్ట్రాల విద్యుత్‌ శాఖల మంత్రులతో శుక్రవారం జరిగిన వర్చువల్‌ సమావేశంలో ఆయన ఈ విషయాలు తెలిపారు. ‘మనం ఇక్కడ ప్రతీదీ తయారు చేసుకుంటున్నాం. అయినా కూడా భారత్‌ రూ. 71,000 కోట్ల విలువ చేసే విద్యుత్‌ పరికరాలను దిగుమతి చేసుకుంది. ఇందులో రూ.21,000 కోట్ల మేర చైనా నుంచి దిగుమతయ్యాయి. మన దేశంలోకి చొరబడే పొరుగు దేశం నుంచి ఈ స్థాయిలో దిగుమతులను అనుమతించలేం. చైనా, పాకిస్తాన్‌ల నుంచి ఏదీ కొనుగోలు జరిపే ప్రసక్తే లేదు. ఆయా దేశాల నుంచి దిగుమతులకు అనుమతులివ్వబోము.
ఈ దిగుమతి చేసుకున్న వాటిల్లో (చైనా నుంచి) ఏ మాల్‌వేర్‌ ఉందో ట్రోజన్‌ హార్స్‌ ఉందో (వైరస్‌లు). వీటి సాయంతో వారు అక్కడెక్కణ్నుంచో మన విద్యుత్‌ వ్యవస్థలను చిన్నాభిన్నం చేయొచ్చు’ అని మంత్రి వ్యాఖ్యానించారు. టవర్‌ ఎలిమెంట్లు, కండక్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు మొదలైనవి భారత్‌లోనే తయారవుతున్నా.. వాటిని దిగుమతి చేసుకోవడం ఆందోళనకరమైన విషయమన్నారు. ‘మీ డిస్కంలు చైనా కంపెనీల నుంచి పరికరాలను దిగుమతి చేసుకుంటున్నాయి. చైనా కంపెనీల నుంచి కొనుగోళ్లు చేయొద్దని కోరుతున్నాం’ అని రాష్ట్రాల విద్యుత్‌ శాఖ మంత్రులకు మంత్రి సూచించారు. స్వయం సమృద్ధి భారత్‌ నినాదంలో భాగంగా ఇక్కడ లభించే ఏ పరికరాన్నీ చైనా నుంచి భారత్‌ దిగుమతి చేసుకోబోదని చెప్పారు. దిగుమతి చేసుకున్న వాటిని కూడా క్షుణ్నంగా తనిఖీ చేస్తుందని, ఆ తర్వాత అవసరమైతే వాటిని రద్దు కూడా చేయొచ్చని కూడా ఆయన తెలిపారు.