56 రోజులు.. రూ.3,800 కోట్లు మందు తాగారు
కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు లిక్కర్ అమ్మకాలు కాసుల పంట పండిస్తున్నాయి. గత రెండు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా రూ.3,800 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. లాక్‌డౌన్ ఉపసంహరణ అనంతరం మే 6వ తేదీ నుంచి రాష్ట్రంలో మద్యం విక్రయాలు ప్రారంభం కాగా, ఆ నెలలో రూ.1,864 కోట్లు, జూన్ మాసం మొత్తంలో రూ.1,955 కోట్ల విలువైన బీర్లు, లిక్కర్ కేసులను వైన్స్ యజమానులు మద్యం డిపోల నుంచి కొనుగోలు చేశారు. అయితే, మే నెలతో పోలిస్తే జూన్ నెలలో కొంత కిక్కు తగ్గినట్టు కనిపిస్తున్నా పెద్దగా ప్రభావం చూపలేదు. జూన్ రెండో సగ భాగంలో షాపుల లైసెన్సు ఫీజులు కట్టాల్సి రావడంతో డబ్బులు సర్దుబాటు కాక వైన్స్ యజమానులు స్టాక్ పెట్టుకునేందుకు తంటాలు పడాల్సి వచ్చింది. కానీ, మళ్లీ రాష్ట్రంలో, ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో లాక్‌డౌన్ విధిస్తారన్న ప్రచారంతో జూన్ మాసంలో చివరి మూడ్రోజులు డిపోల నుంచి మద్యం విక్రయాలు పెరిగాయి. మొత్తం మీద ఈ రెండు నెలల మద్యం అమ్మకాల ద్వారా రూ.3,000 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరినట్టైంది.