టిక్‌టాక్‌కు… 45 వేల కోట్ల నష్టం!

చైనా యాప్‌లపై భారత నిషేధం కారణంగా చైనాకు చెందిన బైట్‌డాన్స్‌ లిమిటెడ్‌కు రూ.45,000 కోట్లు(600 కోట్ల డాలర్లు) నష్టం వస్తుందని అంచనా. సరిహద్దుల ఉద్రిక్తతల నేపథ్యంలో టిక్‌టాక్‌తో సహా మొత్తం 59 చైనా యాప్‌లను భారత దేశం నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధ యాప్‌ల జాబితాలో బైట్‌డాన్స్‌కు చెందిన యాప్‌లు మూడు(టిక్‌టాక్, విగో వీడియో, హెలో యాప్‌) ఉన్నాయి. మిగిలిన యాప్‌ల నష్టాలతో పోల్చితే ఈ మూడు యాప్‌ల నష్టాలే అధికమని కైయాక్సిన్‌గ్లోబల్‌డాట్‌కామ్‌ పేర్కొంది. విదేశాల్లో అత్యధికంగా ప్రాచుర్యం పొందిన చైనా యాప్‌ల్లో టిక్‌టాక్‌ కూడా ఒకటి. టిక్‌టాక్‌కు చైనా తర్వాత అత్యధిక యూజర్లు ఉన్నది భారత్‌లోనే. ఈ ఏడాది తొలి 3 నెలల కాలంలో 61.1 కోట్ల డౌన్‌లోడ్స్‌ జరిగాయి. ఇది ప్రపంచవ్యాప్త టిక్‌టాక్‌ డౌన్‌లోడ్స్‌లో 30 శాతం.