తెలంగాణలో ఆగని కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి మరింతగా పెరుగుతోంది. పది రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నయి. మంగళవారం 879, బుధవారం 891, గురువారం 920 కేసులు నమోదుకాగా.. శుక్రవారం ఏకంగా 985 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. ఇందులో గ్రేటర్ హైదరాబాద్‌లోనే 774 కేసులు నమోదైనట్టు హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. రంగారెడ్డిలో 86, మేడ్చల్ లో 53, వరంగల్ అర్బన్ 20, మెదక్ 9, ఆదిలాబాద్ 7, సిరిసిల్ల, నాగర్‌కర్నూల్, నిజామాబాద్‌లలో 6 చొప్పున, సిద్దిపేట, భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లో 3 చొప్పున, ములుగు, జగిత్యాల, భువనగిరిల్లో 2 చొప్పున, వికారాబాద్, మహబూబ్‌నగర్, మిర్యాలగూడల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 12,349కు పెరిగింది. ఇందులో 4,766 మంది కోలుకోగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 7,436కు పెరిగింది. కరోనాతో శుక్రవారం మరో ఏడుగురు చనిపోయినట్టు హెల్త్ డిపార్ట్మెంట్ తెలిపింది. వీటితో కలిపి మరణాల సంఖ్య 237కు పెరిగినట్టు పేర్కొంది.