ఆ కాలేజీలకు నోటీసులు
ఇంటర్మీడియట్ ఫలితాలను టీవీలు, పత్రికల్లో ప్రచారం చేస్తున్న కాలేజీలకు నోటీసులు జారీ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఆదేశించారు. ఇంటర్ ఫలితాల తర్వాత పలు కాలేజీల యాజమాన్యాలు ర్యాంకులను, మార్కులను టీవీలు, పత్రికల్లో ప్రచారం చేస్తూ ప్రవేశాల కోసం విద్యార్థులను ఆకర్షిస్తున్నాయన్నారు. తమ కాలేజీ విద్యార్థులే పట్టణ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి టాపర్లుగా, ర్యాంకర్లుగా పేర్కొంటూ విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇదీ బోర్డు నిబంధనలకు విరుద్ధమని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి ప్రయత్నాలు చేసిన కాలేజీలకు వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించే వారికి కనీసం మూడేళ్లు, గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధించవచ్చని పేర్కొన్నారు.