రైతుబంధు పథకానికి పీవీ నరసింహారావు పేరు పెట్టాలి: పొన్నం

తెలంగాణ ప్ర‌భుత్వం మాజీ ప్ర‌ధాని ‌పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల కోసం కమిటీని ఏర్పాటుచేసి, నిధులు ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంద‌ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇదే విష‌య‌మై శుక్ర‌వారం ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని పార్లమెంటులో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని …. 2013లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని చెప్పారు. కాబట్టి పెండింగ్ లో ఉన్న ఈ తీర్మానం అమలుకు కేంద్రం పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకు రావాలని కోరుతున్నామ‌ని చెప్పారు. పీవీ నరసింహారావు స్వర్గస్తులైన దాదాపు దశాబ్దంన్నర కాలానికైనా పీవీ సేవలను తెరాస‌ ప్రభుత్వం గుర్తించినందుకు సంతోష‌మ‌ని చెప్పిన పొన్నం.. పీవీ నరసింహారావు పై మీకు(తెరాస‌కు) నిజంగా గౌరవం, ప్రేమ, అభిమానం ఉంటే రైతుబంధు పథకానికి పి.వి.నరసింహారావు పేరు పెట్టాలన్నారు. అలాగే వరంగల్ అర్బన్ జిల్లా కు, శ్రీరాంసాగర్ కాలువకు కూడా పీవీ పేరు పెట్టాలని చెప్పారు. వీటితోపాటు తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీ కి ,ఒక యూనివర్సిటీ కి పీవీ నరసింహారావు పేరు పెట్టి మీ చిత్త శుద్ధిని నిరూపించుకోవాలని పొన్నం సీఎం కు రాసిన లేఖ‌లో పేర్కొన్నారు.