అందుకే సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడా?
మనోవేదన, అనారోగ్యంతో బాధపడుతున్న ఓ సర్పంచ్ ఉరివేసుకొని తనువు చాలించాడు. ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లా చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పరిగి సీఐ లక్ష్మీరెడ్డి కథనం ప్రకారం.. పూడూరు మండలంలోని కొత్తపల్లికి చెందిన కావలి ఆనందం(35) గత ఎన్నికల్లో సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. అయితే, ఆయన మంగళవారం రాత్రి కుటంబీకులతో కలిసి భోజనం చేసి ఓ గదిలో నిద్రించాడు. బుధవారం తెల్లవారినా నిద్రలేవలేదు. పడుకొని ఉండొచ్చని భావించిన ఆయన తమ్ముడు శ్రీహరి పొలానికి వెళ్లాడు. గంట తర్వాత అతడు తిరిగి వచ్చినా గది తలుపులు తెరవకపోవడంతో అనుమానంతో గదికి వెనుక ఉన్న తలుపులను తీసి చూడగా ఆనందం దూలానికి ఉరివేసుకొని విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. కొంతకాలంగా తన సోదరుడికి ఆరోగ్యం సహకరించడం లేదని శ్రీహరి తెలిపారు. ఈక్రమంలో మానసికంగా వేదనకు గురై తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆనందం రాసిన ఓ సూసైట్ నోట్‌ను పోలీసులుస్వాధీనం చేసుకున్నారు. తన చావుకు ఎవరూ బాధ్యులు కారని అందులో సర్పంచ్ పేర్కొన్నాడు. వచ్చే నెలలోతనకు వివాహం నిశ్చయమైందని, అంతలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబీకులు రోదనలు మిన్నంటాయి. మృతుడి సోదరుడు శ్రీహరి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లక్ష్మీరెడ్డి తెలిపారు.