ఒక్కరోజే తెలంగాణలో 872 కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకూ భారీగా కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 872 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసుల సంఖ్య ఇదే. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,674కు పెరిగింది. సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకు రాష్ట్రంలోని కరోనా పరిస్థితిపై ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల సమయంలో 3,189 మందికి టెస్టులు చేయగా.. వారిలో 872 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇందులో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 713, రంగారెడ్డి జిల్లాలో 107 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ జిల్లాలో 16, సంగారెడ్డి జిల్లాలో 12, వరంగల్ రూరల్‌లో 6, మంచిర్యాలలో 5 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో మూడు చొప్పున, మహబూబాబాద్, కరీంనగర్, జనగామ జిల్లాల్లో రెండేసి, వరంగల్ అర్బన్ జిల్లాలో ఒకటి చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.
గడిచిన 24 గంటల్లో 247 మంది కరోనా నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4005కు చేరింది. ప్రస్తుతం 4,452 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక గడిచిన 24 గంటల్లో ఏడుగురు మరణించగా.. కరోనా మృతుల సంఖ్య 217కు చేరింది.