రైతులకు శుభవార్త… రైతుబంధు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. రాష్ట్రంలో రైతుబంధు నిధులు విడుదల చేసినట్లు ప్రకటించింది. ఇవాళ ఒక రోజే 50.84 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.5,294.53 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. జూన్ 16 వరకు పాస్ బుక్ వచ్చిన ప్రతి ఒక్కరికి రైతుబంధు అందనుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రికార్డు సమయంలో రైతుబంధు నిధులు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. వానా కాలం పంటలు వేసిన నేపథ్యంలో రైతులకు ఈ డబ్బులు ఉపయోగపడనున్నాయి. రైతు బంధుకు సంబంధించి ప్రతి పంటకు ఎకరానికి రూ.5 వేలు చొప్పున పెట్టుబడి సాయంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాస్ బుక్ లు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ రైతు బంధు వర్తింపు చేసింది. బ్యాంకు వివరాలు ఇవ్వని 5 లక్షల మంది రైతులు ఉన్నారు. ఏఈవోలకు వివరాలు అందగానే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.