యువ‌కుల్లో పెరుగుతున్న క‌రోనా కేసులు

ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న‌కు తెలిసింది వృద్ధుల్లో, చిన్నారుల్లో, రోగ‌నిరోధ‌క శ‌క్తి ఉన్న‌వారిలో మాత్ర‌మే ఎక్కువ‌గా క‌రోనా సోకుతుంద‌ని అనుకున్నాం. కానీ ఇప్పుడా ఆ వైర‌స్ త‌న రూట్ మార్చింది అని చెప్పుకోవాలి. అంచనాలకు విరుద్ధంగా ఉత్తర్‌ ప్రదేశ్‌లో కరోనా మహమ్మారితో బాధపడే రోగుల్లో 50 శాతం మంది 21 నుంచి 40 ఏళ్లలోపు వారేనని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది. యూపీలో నమోదైన 7884 కేసుల్లో యువకులు 51.93 శాతం కాగా, వీరిలో రికవరీ రేటు జాతీయ సగటు 52.95 కంటే అధికంగా 60.83 శాతంగా ఉంది. ఇక కరోనా కేసుల్లో 41 నుంచి 60 ఏళ్లలోపు మధ్యవయస్కులు 30 శాతం వరకూ ఉన్నారు. ఆరు శాతం మంది సీనియర్‌ సిటిజన్లు కరోనా బారినపడిన వారిలో ఉన్నారు. మరోవైపు కరోనా వైరస్‌ సోకే ముప్పు కేవలం వయసు ఆధారంగానే కాకుండా ఇతర అనారోగ్య కారణాలూ దీనికి దారితీస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. ఇతర తీవ్ర అనారోగ్యాలతో ఇబ్బంది పడే వృద్ధులకు కరోనా వైరస్‌ సోకితే వ్యాధి ముదిరే అవకాశం ఉంటుందని పేర్కొంది. కోవిడ్‌-19 బారినపడే ప్రతి ఐదుగురిలో ఒకరికి తీవ్ర అస్వస్థత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయని స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల్లో 80 శాతం మంది ఆస్పత్రిలో చికిత్స అవసరం లేకుండానే కోలుకుంటారని పేర్కొంది.