చైనా వక్రబుద్ధితో ప్రాణాలు కొల్పోయిన నల్గొండ బిడ్డ
భారత్ – చైనా సరిహద్దు ఘర్షణల్లో వీర మరణం పొందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబుకు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆయన జీవితం యువతకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. భారతీయుల రక్షణ కోసం కుమారుడిని సైన్యంలోకి పంపిన సంతోష్ తల్లిదండ్రులకు యావత్ దేశం రుణపడి ఉంటుందన్నారు. కాగా సంతోష్ మరణవార్త తెలిసిన వెంటనే ఆయన తల్లిదండ్రులకు ఫోన్ చేసి సుఖేందర్ రెడ్డి పరామర్శించారు
ఈ క్రమంలో తమ కుమారుడి భౌతికకాయాన్ని త్వరితగతిన స్వస్థలానికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలని వారు ఆయనను కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సుఖేందర్‌రెడ్డి ఈ విషయం గురించి సంబంధిత అధికారులతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. భారత భూభాగంలోకి అడుగుపెట్టాలనే దురాలోచనను చైనా విరమించుకోవాలని లేదంటే.. డ్రాగన్ దుర్మార్గానికి భారత సైన్యం తగిన సమాధానం చెబుతుందని హెచ్చరించారు. కాగా లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో మంగళవారం భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో భారత ఆర్మీలో సేవలు అందిస్తున్న, సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబుతో పాటు మరో ఇద్దరు సైనికులు అమరులయ్యారు.