మరోసారి లాక్‌డౌన్ నిజమేనా ?
తెలంగాణలో లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చిన సంతోషాని కంటే విషాదాన్నే ఎక్కువ ఇస్తుంది అని చెప్పుకోవాలి. ఇదే పరిస్థితి దేశ వ్యాప్తంగా కొనసాగుతోంది. లాక్‌డౌన్‌కు ముందు తక్కువగా ఉన్న కేసుల సంఖ్య ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ప్రతిరోజు తొమ్మిది, పది వేల వరకు కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. ఫలితంగా అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ ప్రస్తుతం ఐదవ స్థానంలో ఉండగా త్వరలోనే నాల్గవ ప్లేస్‌లో ఉన్న యూకేను అధిగమించేట్లు తెలుస్తోంది. (కరోనా లక్షణాలుంటే సెలవు తీసుకోండి)
ఇక కేసుల పరంగా దేశంలోని మహారాష్ట్ర ఏకంగా చైనానే దాటేసింది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేయనుందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. జూన్ 15 నుంచి దేశంలో మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్ ప్రారంభం కానుందని దీని సారాంశం. అయితే ఈ వార్తను కేంద్ర ప్రభుత్వం ఖండిస్తూ.. ఇదో తప్పుడు కథనంగా కొట్టిపారేసింది. సంపూర్ణ లాక్‌డౌన్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.