ఆస్పత్రి బాత్రూంలో కరోనా పేషంట్ డెడ్ బాడీ

దేశంలో కరోనాతో చనిపోయేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. మహారాష్ట్రలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. అక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షకు చేరువలో ఉంది. చాలామంది క్వారంటైన్ లో ఉండటానికి ఇష్టంలేక ఆస్పత్రుల నుంచి పారిపోతున్నారు. అలాంటి వారిని ప్రభుత్వాలు వెతికి పట్టుకొని మళ్లీ ఆస్పత్రికి చేరుస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని జల్గావ్ సివిల్ హాస్సిటల్ నుంచి కనిపించకుండాపోయిన కరోనా పేషంట్ బుధవారం శవమై కనిపించింది. జల్గావ్ హాస్పిటల్ లో కరోనా చికిత్స తీసుకుంటున్న 82 ఏళ్ల మహిళ జూన్ 2న కనిపించకుండా పోయింది. ఆమె కనిపించని విషయం గురించి ఆస్సత్రి వర్గాలు జూన్ 6న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆస్పత్రిలో వెతకగా.. వాడకంలో లేని వాష్ రూంలో మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళ ఎలా చనిపోయిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.