స‌ర్పంచ్ దారుణ హ‌త్య‌

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఓ సర్పంచ్ దారుణహత్యకు గురయ్యాడు. లర్కిపొర ప్రాంతంలోని లక్‌భవన్‌ గ్రామ సర్పంచ్ అయిన అజయ్ పండిత భారతి(40)ని ఆయన ఇంటి సమీపంలోనే ఉగ్రవాదులు కాల్చిచంపారు. తీవ్ర గాయాలపాలైన ఆయనను ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, భద్రతా దళాలు ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించి ఉగ్రవాదుల కోసం గాలించాయి. సర్పంచ్ కాల్చివేతపై రాజకీయనాయకులు తీవ్రంగా స్పందించారు. అజయ్ పండిత హత్య తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇతిజా ముఫ్తీ, జమ్ముకశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా, సోఫియా యూసుఫ్‌లు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.