సీజనల్‌ వ్యాధులుకి..కరోనా తోడైతే ఇక అంతే

రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఇంకా తొలగిపోలేదు.. వానకాలం మాత్రం తరుముకొస్తున్నది.. వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలతోపాటే సీజనల్‌ వ్యాధులూ పలుకరిస్తాయి. కరోనాకు సీజనల్‌ వ్యాధులు తోడైతే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. అందువల్ల ఇకనుంచి ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా బాధ్యతగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా లక్షణాలు, సీజనల్‌ జ్వరాల లక్షణాలు దాదాపుగా ఒకేలా ఉంటాయి. దాంతో ఏది కరోనానో, ఏది సీజనల్‌ వ్యాధో గుర్తించడం వైద్యులకు సవాలుగా మారే అవకాశమున్నది. వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం, వైరల్‌ ఫీవర్స్‌తో పాటు డెంగ్యూ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు ప్రబలడం సహజం. వీటిని అరికట్టేందుకు అధికారులు సిద్ధంగానే ఉంటారు. కానీ కరోనా చాపకింద నీరులా ప్రబలుతుండగానే వానకాలం వచ్చింది. కరోనా, సీజనల్‌ వ్యాధులు ఓవర్‌ల్యాప్స్‌ అవుతాయని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ఒకే వ్యక్తికి డెంగ్యూ, మలేరియా, స్తెన్‌ ఫ్లూ వంటి సీజనల్‌ వ్యాధులతోపాటు కరోనా కూడా సోకితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న వైద్యులను ఆందోళనకు గురిచేస్తున్నది.

కంటైన్‌మెంట్‌లోనే కరోనా టెస్ట్‌!
జ్వరం వచ్చిన ప్రతిఒక్కరికీ కరోనా పరీక్షలు చేయడం సాధ్యంకాదు. అయినా ఏ ఒక్కకేసును తేలికగా తీసుకోలేమని ఆరోగ్యశాఖ అధికారులు అంటున్నారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో ఎవరికైన జ్వరం లక్షణాలుంటే కొవిడ్‌-19 పరీక్షలు చేస్తామని, సాధారణ ప్రాంతాల్లోనివారికి మాత్రం మూడురోజులపాటు సాధారణ ఔషధాలు ఇచ్చి జ్వరం తగ్గకపోతే కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు.