75 రూపాయాలకే న్యూస్ వెబ్‌సైట్ అమ్మకం
కరోనా దెబ్బకి తెలుగు మీడియాలో ఉద్యోగాలు ఊడిపోతుంటే… ఒక దేశంలో ఏకంగా ఒక న్యూస్ వెబ్‌సైట్‌ని అమ్మకానికి పెట్టారు. లాక్‌డౌన్ వల్ల అన్ని దేశాల్లో రెవెన్యూ పడిపోయి మీడియా సంస్థలు కుదేలవుతున్నాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ‘స్టఫ్’. ఎన్నో జాతీయ దినపత్రికలను ప్రచురిస్తూ, స్టఫ్ పేరుతోనే ఎంతో ప్రజాదరణ కలిగిన వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్న ఈ సంస్థను.. కేవలం డాలర్‌కే (మన రూపాయిల్లో రూ.75) కంపెనీ సీఈవో సినేడ్ బౌచర్‌కు విక్రయిస్తున్నట్టు మాతృ సంస్థ నైన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రకటించింది. ఈ డీల్ ఈ నెలాఖరుకు పూర్తవుతుందని ఆస్ట్రేలియన్ స్టాక్ మార్కెట్‌కు తెలియజేసింది. స్టఫ్‌లో 400 జర్నలిస్టులు సహా 900 మంది పనిచేస్తున్నారు. ప్రకటనల ఆదాయం పడిపోవడంతో స్టఫ్ ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్న క్రమంలో ఈ డీల్ చోటు చేసుకుంది.