టీఆర్ఎస్ ఎమ్మెల్యే బర్త్ డే పార్టీ.. హైకోర్టు నోటీసులు

లాక్‌డౌన్ టైంలో జనం గుమికూడటంపై ఆంక్షలు ఉన్నా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బర్త్ డే వేడుకను ధూం ధాంగా నిర్వహించారు. ఈ నెల 7న 500 మంది సమక్షంలో ఆయన పుట్టిన రోజుల వేడుకలను జరుపుకున్నారని ఓ వ్యక్తి హైకోర్టులో పిల్ వేశారు. ఇది లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించడమేనన్నారు. లాక్‌డౌన్ టైంలో పెళ్లిళ్లకు కూడా పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానిస్తున్నారని.. నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి బర్త్ డే పార్టీలో మాత్రం ఎక్కువ మంది పాల్గొన్నారని పిటిషన్ తరఫు లాయర్ వాదించారు.
పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న వారు మాస్కులను కూడా ధరించలేదని లాయర్ వాదించారు. మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారని తెలిపారు. పిటిషనర్ వాదనలు విన్న న్యాయస్థానం ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకలకు అనుమతి ఎలా ఇచ్చారో చెప్పాలని చీఫ్ సెక్రటరీ, డీజీపీ, సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారాని వాయిదా వేసింది.
లాక్‌డౌన్ వేళ ఎమ్మెల్యే ఘనంగా బర్త్ డే వేడుకలను చేసుకోవడం పట్ల టీఆర్ఎస్ నేతలు మండి పడుతున్నారు. ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.