హమ్మయ్య సెప్టెంబర్‌లోనే తొలి విడత వ్యాక్సిన్ ?

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ కనుగొనే క్రమంలో భారీ ముందడుగు పడింది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌కు పూర్తిగా సహకరిస్తామని బయోఫార్మా సంస్థ ఆస్ర్టాజెనెకా స్పష్టం చేసింది. మూడో దశ పరీక్షలకు పరిశోధకులకు సహకరిస్తామని పేర్కొంది. 40 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ తయారీకి ఒప్పందం ఖరారైందని..మొత్తం వంద కోట్ల డోసులను తయారు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని ఆస్ర్టాజెనెకా గురువారం ప్రకటించింది. సెప్టెంబర్‌లోనే తొలి విడత వ్యాక్సిన్‌ సరఫరాలను చేపడతామని, వ్యాక్సిన్‌ అభివృద్ధి, తయారీ, సరఫరా కోసం అమెరికన్‌ బయోమెడికల్‌ పరిశోధన అభివృద్ధి సంస్థ (బీఏఆర్‌డీఏ) నుంచి తమకు వంద కోట్ల డాలర్ల నిధులు మంజూరయ్యాయని సంస్ధ ప్రకటించింది. ఇందులో​ భాగంగా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ చేపట్టే మూడోవిడత క్లినికల్‌ ట్రయల్స్‌కు కంపెనీ సహకరిస్తుందని ఆస్ర్టాజెనెకా తెలిపింది. 30,000 మందిపై వ్యాక్సిన్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తారని వెల్లడించింది. ఈ వ్యాక్సిన్‌ను అతి త్వరగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చేందుకు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో తాము కలిసిపనిచేస్తామని కంపెనీ సీఈఓ పాస్కల్‌ సోరియట్‌ వెల్లడించారు.