ఏపీకి సర్కారుకు సహకరిస్తున్న తెలంగాణ సర్కార్

ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోని నాగార్జున సాగర్‌ కుడి కాల్వ కింద గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలకు రెండు టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కృష్ణా బోర్డు అనుమతించింది. కరోనా నేపథ్యంలో కుడి కాల్వ కింద గృహావసరాలకు నీటి వినియోగం పెరిగినందున తమకు తక్షణమే నీటిని విడుదల చేయాలన్న ఏపీ వినతికి తెలంగాణ అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఈ నీటి విడుదలకు ఓకే చెబుతూ శుక్రవారం బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం ఉత్తర్వులు జారీ చేశారు. సాగర్‌ కుడి కాల్వ తాగునీటి అవసరాలపై చర్చించేందుకు పరమేశం అధ్యక్షతన జలసౌధలో త్రిసభ్య కమిటీ భేటీ జరిగింది.
ఈ భేటీకి ఏపీ, తెలంగాణ ఈఎన్‌సీలు నారాయణరెడ్డి, మురళీధర్‌లు హాజరయ్యారు. సాగర్‌కుడి కాల్వ కింద ఇప్పటికే ఏపీ వినియోగం పూర్తయిందని, దీనిపై ఇదివరకే బోర్డు ఏపీకి లేఖ రాసిన విషయాన్ని తెలంగాణ ఈఎన్‌సీ గుర్తు చేశారు. అయితే ఈ లెక్కలు తప్పుల తడకగా ఉన్నాయని, తమ వినియోగ లెక్కలు, బోర్డు చెబుతున్న లెక్కలకు పొంతన లేదని ఏపీ ఈఎన్‌సీ తెలిపారు. వినియోగ లెక్కలపై మరో భేటీలో చర్చిద్దామని, ప్రస్తుత అవసరాల దృష్ట్యా నీటిని విడుదల చేయాలని కోరగా…బోర్డు అందుకు అంగీకరించింది. కనీస నీటి మట్టం దిగువకు వెళ్లే అంశంపైనా చర్చ జరిగినా, ఆ అవసరం లేదని బోర్డు అభిప్రాయపడినట్లుగా తెలిసింది. ఈ నీటిని ఈ నెల 31 వరకు వినియోగించుకోవచ్చని తెలిపింది.