మారుతున్న కరోనా వైరస్ లక్షణాలు
ప్రపంచవ్యాప్తంగా మానవాళి మనుగడకే సవాలు విసురుతున్న కరోనా వైరస్ దేశాల వారీగా, జాతుల వారీగా భిన్న ప్రభావాన్ని ఎందుకు చూపుతున్నది? భారత్‌లో మరణాల రేటు తక్కువగా ఉండటానికి కారణాలేమిటి? వాతావరణ పరిస్థితులను బట్టి వైరస్ స్వభావం మారుతున్నదా? అన్న అంశాలపై పరిశోధనను హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సీసీఎంబీ) ముమ్మరం చేసింది. వివిధ దేశాలలో విస్తరిస్తున్న వైరస్, మనదేశంలోని వైరస్ జన్యుక్రమంలో పెద్ద తేడా లేకున్నా.. దాని తీవ్రతలో తేడాను గమనిస్తున్నామని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా చెప్పారు. ఇప్పటికే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతోపాటు దేశ వ్యాప్తంగా 300కు పైగా రకరకాల నమూనాలను పరిశీలించి వాటి కణాలను వేరుచేశామని చెప్పారు. ఇప్పటివరకు జన్యువులను ఐసొలేట్(వేరు) చేశామన్నారు. దేశంలో ప్రబలుతున్న వైరస్ జన్యుక్రమంలో పెద్దగా తేడా ఉన్నట్టు ఇప్పటివరకు కనిపించకపోయినా మరణాల రేటు మాత్రం చాలా తక్కువగా ఉన్నది నిజమేనన్నారు. గాంధీ దవాఖానలో కోలుకుంటున్నవారి సంఖ్య ఎంతో మెరుగ్గా ఉందని చెప్పారు. త్వరలోనే వైరస్ జన్యు నిర్మాణంలో తేడాలపై స్పష్టమైన అవగాహనకు వస్తామని చెప్పారు. తద్వారా వ్యాక్సిన్ తయారీకి, మెరుగైన చికిత్సను అందించడానికి మరింత ఉపయోగం ఉంటుందని చెప్పారు.
ఎండ తీవ్రతతో తగ్గుతున్న ప్రభావం
మనదేశంలో ప్రబలుతున్న కరోనా వైరస్ తీవ్రత తక్కువగా ఉన్నదని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు చెప్పారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వైరస్ విజృంభణ తక్కువగా ఉన్నట్టు ప్రాథమిక పరిశోధనలో తేలిందని ఆయన ‘నమస్తే తెలంగాణ’కు చెప్పారు. వైరస్ ప్రభావం వివిధ జాతులపై భిన్నంగా ఉందని చెప్పారు. భారతీయులు తరచుగా వైరస్‌లకు గురికావడం, బాల్యం నుంచే బీసీజీ వ్యాక్సిన్ వంటివి తీసుకోవడం కూడా మరణాలరేటు తక్కువగా ఉండటానికి కారణమని అన్నారు. మన ఆహారపు అలవాట్లు, భిన్నమైన జన్యు నిర్మాణం, గతంలో ఇటువంటి వ్యాధులను ఎదుర్కొన్నందున భారతీయుల్లో రోగ నిరోధక శక్తి అధికంగా ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ జాతులవారీగా కూడా ప్రభావం చూపుతున్నదని చెప్పారు.