చైనాకు చెక్ పెడుతున్న అమెరికా
ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అలీబాబా, బైదూ ఇంక్ వంటి చైనా కంపెనీలను అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల నుంచి తొలగించేందుకు దారితీసే తీర్మానాన్ని అమెరికన్ సెనేట్ ఆమోదించింది. చైనా కంపెనీల డీలిస్టింగ్‌తో పాటు విదేశీ కంపెనీల ప్రాధాన్యతను తగ్గించేలా బిల్లును రూపొందించింది. చైనా కంపెనీల్లో అమెరికన్ల నిధుల ప్రవాహానికి అడ్డుకట్ట వేసేలా కీలక బిల్లును ఆమోదింపచేసింది. రిపబ్లికన్, డెమొక్రాట్ సెనేటర్లు జాన్ కెన్నెడీ, క్రిస్ వాన్ హాలెన్ ప్రతిపాదించిన బిల్లును యూఎస్ సెనేట్ గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది. చైనా దిగ్గజ కంపెనీల్లో కోట్లాది డాలర్లను పెట్టుబడుల రూపంలో కుమ్మరించడం పట్ల చట్టసభ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పెన్షన్ ఫండ్‌లు, విద్యా సంస్ధల నిధులను సైతం ఆకర్షణీయ రాబడుల కోసం చైనా కంపెనీల్లో మదుపు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
చైనా కంపెనీలను టార్గెట్‌గా చేసుకున్న ఈ బిల్లులో పొందుపరిచిన అంశాలను చూస్తే..విదేశీ ప్రభుత్వ నియంత్రణలో పనిచేయడం లేదని కంపెనీలు స్పష్టం చేయని పక్షంలో వరుసగా మూడేళ్లు కంపెనీ ఆడిటింగ్‌ను పబ్లిక్ కంపెనీ అకౌంటింగ్ పర్యవేక్షక బోర్డు ఆడిట్ చేయకుండా, ఆయా కంపెనీల షేర్లను ఎక్స్ఛేంజ్‌ల నుంచి నిషేధించేలా ఈ బిల్లును రూపొందించారు. కాగా, నియమాలకు అనుగుణంగా చైనా నడుచుకోవాలని తాను కోరుకుంటున్నానని సెనేట్‌లో బిల్లును ప్రతిపాదిస్తూ కెన్నెడీ పేర్కొన్నారు. స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో లిస్టయిన కంపెనీలన్నీ ఒకే ప్రమాణాలను కలిగిఉండాలని, ఈ బిల్లు ఆ ప్రమాణాలను తీసుకురావడంతో పాటు ఇన్వెస్టర్లు మెరుగైన నిర్ణయాలు తీసుకునేలా పారదర్శకత అందిస్తుందని మరో సెనేటర్ వాన్ హోలెన్ అన్నారు.