వాడుకొని వదిలేశారు..
మనదీ ఓ బతుకేనా..ఇదేనా జర్నలిస్టుల కు ఇచ్చే గౌరవం..తెలంగాణా రావాలని కలలు గని,దాని కోసం యజమాన్యాలను ఎదిరించింది ఇందుకేనా… తోటి ఆంధ్రా జర్నలిస్టులతో ఘర్షణ పడి నా తెలంగాణా నాక్కావాలే అని గర్జించింది ఇందుకేనా…తెలంగాణా కు అనుకూలంగా వ్యాసాలు,కథనాలు రాసి,బలైంది ఇందుకేనా.. రాజకీయ పార్టీలు తమ పదవుల కోసం తెలంగాణా గొంతెత్తి తే జర్నలిస్టులు నిస్వార్థంగా తెలంగాణా బిడ్డలకు జరుగుతున్న అన్యాయంపై నాయకులు లేకముందు నుండి గొంతెత్తారు.తెలంగాణా ఉద్యమ సమయంలో టిఆర్ఎస్ పార్టీని చీల్చి చెండాడుతుంటే,అండగా నిలిచింది ఈ బక్క చిక్కిన జర్నలిస్టులే. యాజమాన్యాలు సమైక్య గీతం పాడుతున్న టిఆర్ఎస్ కు గొంతుకై నిలిచింది ఈ జర్నలిస్టులే..తప్పులు జరిగిన ప్రతీసారి వెనకేసుకొచ్చి ఆంధ్రా జర్నలిస్టులతో వాదనకు దిగి ఉద్యోగాలు పోగొట్టుకున్నది ఈ జర్నలిస్టులే..ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో ఆంధ్రా నేతలను నేరుగా ప్రశ్నించింది,ఉద్యమానికి ద్రోహం చేసే నేతలను ప్రశ్నించింది మేమే.చేసిన తప్పులను కడుపులో పెట్టుకొని దాచింది,సమర్ధించింది జర్నలిస్టులే..
సెక్రటేరియట్,టిఆర్ఎస్ భవన్ లో నుండి మెడలు పట్టుకొని బయటకు గెంటేస్తారా…
ఉమ్మడి రాష్ట్రంలో సెక్రటేరియట్ లో ఆంధ్రా జర్నలిస్టులదే హవా..ఏనాడైనా తెలంగాణా రాకపోదు, తెలంగాణా జర్నలిస్టులుగా రిపోర్టింగ్ చేయకపోదుమా అని కాంక్షించిన తెలంగాణా రిపోర్టర్ లను మెడలు పట్టుకొని సెక్రటేరియట్ బయటకు గెంటేస్తారా… సెక్రటేరియట్ లో రిపోర్టింగ్ తెలంగాణా రాక ముందు నుండి ఉన్న హక్కు…దాన్ని తొలగిస్తారా..ఇదేమని అడిగితే జాగా లేదంటారా.. పురోహితులు లేకుండా పెళ్లవుతుందా.. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో రెండు అర్రలు ఇస్తాము,బీఆర్కే భవన్ లోకి అనుమతిస్తామని చెప్పి ఆరు నెలలు గడుస్తున్నా దిక్కు లేదు.ప్రగతి భవన్ మెట్లకాడ ఫుట్ పాత్ ల మీద, తాగడానికి నీళ్లు లేక దోమలు కుడుతూంటే రోజుల తరబడి రిపోర్టింగ్ చేస్తుంటే దిక్కు మొక్కూ లేదు..సమీక్షలు చేస్తుంటే ప్రెస్ మీట్ల కోసం అడుక్కోవాల్సిన దుస్థితి.. జీతాలు మెక్కుతున్న పీఆర్వోలు కనీసం ఫోన్ ఎత్తి సమాధానం ఇవ్వాలనే సోయి లేని అయోగ్యులు..
జర్నలిస్టుల కు కేసీఆర్ తెలియదా, లేక కేసీఆర్ కు జర్నలిస్టులు తెలియదా, టిఆర్ఎస్ భవన్ లో ఉండే నాయకులకు తెలియదా తెలంగాణా భవన్లోకి జర్నలిస్టులు రాకుండా మెడలు పట్టుకొని బయటకు నెట్టేస్తుంటే ఏం చేస్తున్నారు..అధికారంతో కనపడటం లేదా..భవన్ కు కాపలాగా పోలీసులు ఎన్నాళ్లు ఉంటారు..అధికారం ఉన్నంత వరకే కదా…ఉద్యమంలో ఏ పోలీసులు కాపలా ఉన్నరు.. జర్నలిస్టులు కడుపులో పెట్టుకొని చూడలేదా..తెలంగాణా గడ్డన పుట్టిన వాళ్లే కదా గతం మర్చిపోయారా..
జర్నలిస్టులు ఏమడిగారు..
ఇల్లు అడిగారా,కాంట్రాక్టు లు అడిగారా,ఉద్యోగాలు అడిగారా, జీతాలు పెంచమని అడిగారా,ఉద్యోగ భద్రత కావాలన్నారా..బ్యాంకు రుణాలు అడిగారా,పెన్షన్లు అడిగారా,
జర్నలిస్టులు ఏమడిగారు..
కాస్త గౌరవమే కదా..అది కూడా కొత్తది కాదు,మా హక్కులే కదా..బిచ్చం అడుక్కోవాల..జర్నలిస్టుల కు ఆత్మ గౌరవం లేదా..( మీ భాషలో )వాడోడు,వీడోడు చక్కిలిగింతలు పెట్టేటోడు జర్నలిస్టు పేరు చెప్పుకుని మీ పక్కన ఉండొచ్చు..నాడు వాడెక్కడున్నాడో..వాడు ఎవరికి తొత్తులుగా ఉండి మీకు ద్రోహం చేశారో గుర్తుకు తెచ్చుకోండి..వాళ్ళు మీ పక్కన ఉండి తప్పుడు సలహాలు ఇచ్చి మీ పతనానికి పునాదులు తీస్తున్నారు,తప్పులు మీ దృష్టి కి రాకుండా వంత పడుతున్నారని తెలుసుకోండి..
తెలంగాణా జర్నలిస్టులకు ప్రశ్నలడగటం రాదా,
మావి సిల్లీ ప్రశ్నలా..
ఈ ప్రశ్నలే కదా ఆంధ్రా నేతలను హడలెత్తించింది.
ఈ ప్రశ్నలే కదా ఆంధ్రా అధికారులు తెలంగాణా కు చేస్తున్న ద్రోహాన్ని నిలదీసింది.
ఈ ప్రశ్న లే కదా తెలంగాణా ఉద్యమ ద్రోహుల వెన్నులో వణుకు పుట్టించింది..
నాలుగు చానళ్లు చేతిలో ఉన్నాయని జర్నలిస్టులు అలుసయ్యారా..
ఎవడు రాసాడు…దీని వెనక ఎవడున్నాడని వెతక్కండి..వాడున్నడు, వీడున్నడు, ఆ పార్టీ ఉంది,ఈ పార్టీ ఉందని అక్రమ సంబంధాలు అంటగట్టకండి.. ఎవడో ఒకడు కడుపు గాలిన తెలంగాణా జర్నలిస్టు కోపం అంతే..వీలైతే ఆత్మ విమర్శ చేసుకోండి..లేకపోతే మేము ఇంతే ననుకోండి.