ఫ్యామిలీ ప్యాక్ లా కరోనా

కరోనా వైరస్ తో హైదరాబాద్ గజ గజ వణికిపోతోంది . ఎప్పుడు ఎక్కడ ఎలా వరుస అంటుకుంటుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. ప్రధానంగా ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో ఎక్కువగా కేసులు నమోదు కావడం అందరిని భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇటీవల మంగళ్‌హాట్‌ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. కామన్‌ బాత్‌రూం ద్వారా 24 మందికి కరోనా సోకిన విషయం మరువక ముందే, మరో ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన వారిలో ఒకరు మృతి చెందగా, 14 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మరోచోట ఇద్దరికి కరోనా ఉన్నట్లు తేలింది. జుమ్మేరాత్‌బజార్‌ జుంగూర్‌ బస్తీలో నివసిస్తున్న ఓ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ మేనేజర్‌(38)కి ఈ నెల 15న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అతడి కుటుంబంలోని 30 మందిని సరోజినీ, ఎర్రగడ్డ ఆయుర్వేదిక్‌ ఆస్పత్రులకు తరలించారు. అందులో 14 మందికి కరోనా పాజిటివ్‌గా ఆదివారం రిపోర్టులు వచ్చాయి. కరోనా సోకిన వారిలో బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ మేనేజర్‌ తల్లి, సోదరుడు, సోదరుడి కుమారులు ముగ్గురు, పెద్దమ్మ, ఆమె ఇద్దరు కొడుకులు, ఓ కూతురు, అతడి అక్కతోపాటు అల్లుడు, మరో సోదరి, మరో ఇద్దరు మేనళ్లుళ్లు ఉన్నారు. వారికి గాంధీ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ మేనేజర్‌ తండ్రి(60) కరోనాతో చికిత్సలు పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులు శనివారం అర్ధరాత్రి పురానాఫూల్‌లోని సీతల్‌మాత టెంపుల్‌లో అంత్యక్రియలు పూర్తి చేశారు.  
మరో ఇద్దరికి పాజిటివ్‌
శివ్‌లాల్‌నగర్‌లో నివసిస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగికి ఈ నెల 16న కరోనా పాజిటివ్‌ రావడంతో ఆమె కుటుంబంలోని 21 మందిని ఆస్పత్రికి తరలించారు. శనివారం రాత్రి ఆమె రెండో కుమారుడి భార్య, మూడో కుమారుడి భార్యలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.