మెదక్ లో సరి బేసి విధానం పాటించాలి

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కరోన మహమ్మారిని నియంత్రించుట కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన మూడవ విడత లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని మెదక్ జిల్లా ఎస్.పి. చందన దీప్తి హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా ఎస్.పి. గారు మాట్లాడుతూ … ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు లాక్ డౌన్ నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే మున్సిపల్ అధికారులు నిర్ణయించిన ప్రకారం సరి సంఖ్య బేసి సంఖ్య ప్రకారం మాత్రమే షాపులు తెరవాలనీ, దుకాణాదారులు, షాపు యజమానులు తప్పకుండ మాస్కులు ధరించాలని అలాగే తమ దుకాణానికి వచ్చే కొనుగోలు దారులు కూడా మాస్కులు ధరించి కనీసం దూరం పాటించే విధంగా చర్యలు చేపట్టాలని, ఈ నిబంధనలు ఉల్లంఘించి షాపులు తెరిచే యజమానులపైనా చట్టపరమైన చర్యలు తీసుకోటం జరుగుతుందని హెచ్చరించారు. అదేవిధంగా ద్విచక్ర వాహనంపై ఒక్కరికంటే ఎక్కువ, కారులో అయితే ఇద్దరికంటే ఎక్కువ వెళితే వాహనం సీజ్ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నెల 29 వరకు విధించిన లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉంటాయనీ, బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్కు ధరించాలనీ, మాస్కులు లేకుండా తిరిగే వ్యక్తులపై మునిసిపల్, పోలీస్ అధికారులు కలిసి 1000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందన్నారు. వివిధ రాష్ట్రాల నుండి వివిధ జిల్లాల నుండి మెదక్ జిల్లాలో ఉన్న గ్రామాలకు సంబంధించిన వారు ఎవరైనా వస్తే, వచ్చే వారి సమాచారాన్ని గ్రామ పోలీస్ అధికారులు సేకరించి సంబంధిత అధికారులకు తెలపాలని సూచించారు. గ్రామంలో ఉన్న ప్రజలు కూడా వారి వివరాలు సంబంధిత పోలీస్ స్టేషన్లో తెలియజేసి కరోనా వ్యాధి నివారణకు కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ తనకు తానుగా స్వీయ నియంత్రణ పాటించి వ్యాధి ప్రబలకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల నుండి, ఇతర జిల్లాల నుండి మెదక్ జిల్లాకు వచ్చిన ప్రజలకు హెూమ్ క్వారంటైన్ ఉంచాలని పోలీస్ అధికారులకు సూచించారు. ఆరెంజ్ లో ఉన్నామని మనకేమీ కాదనీ ప్రజలు అశ్రద్ధ చేయవద్దని, ప్రతి ఒక్కరూ తనకు తానుగా లాక్ డౌన్ నిబంధనలు, పోలీసుల సలహాలు, సూచనలు పాటించి కొరోనా వ్యాధి నివారణకు కృషి చేయాలని జిల్లా ఎస్.పి. గారు సూచించారు.