ఎంఎస్‌ఎంఈలకు రూ.3లక్షల కోట్ల రుణాలు
తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.3లక్షల కోట్లు రుణాలుగా ఇవ్వనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కరోనా సంక్షోభంతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం పోసేలా ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ వివరాలను ఆమె వెల్లడించారు. బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘సూక్ష్మ, మధ్య, లఘు, కుటీర పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ)కు రూ.3లక్షల కోట్లు ఎలాంటిపూచీకత్తు లేకుండా రుణాలిస్తాం. 12 నెలల మారటోరియంతో ఈ రుణాలు మంజూరుచేస్తాం. ఎంఎస్‌ఎంఈలకు ఆరు అంశాల్లో ఆర్థిక ప్యాకేజీతో ప్రయోజనం కలుగుతుంది. ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను ఇవాళ్టి నుంచి ఒక్కొక్కటిగా వివరాలను ప్రకటిస్తాం. రూ.5లక్షల లోపు ఆదాయ పన్ను రీఫండ్ బకాయిలు వెనక్కి చెల్లించాం. భారత్ స్వయం శక్తితో ఎదగాలనేదే మా లక్ష్యం’’ అని అన్నారు.