ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగింపు
ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) ఫైలింగ్ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ ఫైలింగుల గడువును ఈ ఏడాది నవంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ‘‘2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్ని ఆదాయపు పన్ను ఫైలింగ్ గడువులు 31 జులై 2020, 31 అక్టోబర్ 2020ని నవంబర్ 30కి పొడిగిస్తున్నాం. అలాగే ఆడిట్ గడువును 30 సెప్టెంబర్ 2020 నుంచి 31 అక్టోబర్ 2020కి పొడిగిస్తున్నాం’’ అని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 20 లక్షల కోట్లతో ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. అలాగే, టీడీఎస్ రేటు, టీసీఎస్‌ను 25శాతం తగ్గిస్తున్నామని, ఈ తగ్గింపుతో రూ.50వేల కోట్ల మేర నగదు పన్ను చెల్లింపుదారుల చేతుల్లోకి రానుందని నిర్మలా సీతారామన్ తెలిపారు.