కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులిచ్చిన ఎన్ఎచ్ఆర్సి

విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ఏపీ ప్రభుత్వంతో పాటు మోదీ సర్కార్‌కు జాతీయ మానవహక్కలు కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఏపీలోని విశాఖ జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున స్టైరిన్ గ్యాస్ లీకేజీ కారణంగా తొమ్మిది మంది మృతి, ఐదువేల మందికి పైగా అనారోగ్యానికి గురైనట్లు మీడియాలో కథనాల్లో వచ్చాయి. వాటి ఆధారంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. గ్యాస్ లీకేజ్ సుమారు 3 కిలోమీటర్ల మేరకు వ్యాపించడంతో ప్రజలంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చాలా మంది ప్రజలు రోడ్లపై వచ్చి పడిపోయారు. కొంతమంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని మరియు వారి శరీరాలపై దద్దుర్లు ఉన్నట్లు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. కంపెనీ నిర్లక్ష్యంపై కూడా ఎవరూ ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు కానీ అమాయకులు మాత్రం ప్రాణాలు కోల్పోయారని కమిషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటన పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘనే అని ఎన్‌హెచ్ఆర్సీ పేర్కొంది. కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఇంటిలోనే ఉన్న సమయంలో ఇలా మరో ప్రమాదం ప్రజల ప్రాణాల్ని బలితీసుకుందని మానవ హక్కుల కమిషన్ తెలిపింది. జరిగిన ఘటనపై ప్రభుత్వం ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. బాధితులకు ఎలాంటి వైద్య చికత్స అందిస్తున్నారు. పునరావాసాలు కల్పించారా లేదా అన్న విషయాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ ఏపీ సీఎస్‌ను కమిషన్ ఆదేశించింది. ఏపీ డీజీపీకి కూడా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లో ఈ దుర్ఘటనపై జరిగిన దర్యాప్తు, ఎఫఐఆర్‌లకు సంబంధించిన విషయాలు తెలపాలని కోరింది. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. నిర్దిష్ట పారిశ్రామిక విభాగంలో నిబంధనలు అమలు చేయబడుతున్నాయో లేదో పరిశీలించి నివేదిక సమర్పించాలని కోరింది. నాలుగు వారాల్లో దీనికి సంబంధించిన నివేదికలు పంపాలని ఆదేశిచింది,