చైనా శాస్త్రవేత్త అమెరికాలో హత్య

ప్రాణాంతక కరోనా వైరస్‌పై కీలక పరిశోధనలు చేస్తున్న చైనా సంతతి అమెరికా పరిశోధకుడు బింగ్‌ లీయు (37) దారుణ హత్యకు గురయ్యారు. అమెరికాలోని పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేసే బింగ్ లీ.. తన నివాసంలో శనివారం శవమై తేలారు. పిట్స్‌బర్గ్‌కు ఉత్తరాన రాస్‌ టౌన్‌షిప్‌లోని తన ఇంట్లోనే హో గు అనే వ్యక్తి ఆయన్ను కాల్చి చంపి, ఆపై తనను తాను కాల్చుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి మృతదేహాన్ని కూడా లీయూ ఇంటి వద్ద ఉన్న కారులో పోలీసులు గుర్తించారు. కరోనా వైరస్‌ సోకితే కణస్థాయిలో చోటుచేసుకునే మార్పులను పూర్తిస్థాయిలో అవగాహన చేసుకునే దిశగా జరిపిన ప్రయోగాలు కీలక దశకు చేరుకున్న తరుణంలో లియు హత్యకు గురికావడం గమనార్హం. నిందితుడితో లీయూకి పరిచయం ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరూ చైనా సంతతి పౌరులే కావడం, లీయూను హత్యకు దారితీసిన కారణాలు ఏంటి? అనే దానిపై దర్యాప్తు సాగుతోందని పోలీస్ అధికారులు తెలిపారు. లీయూ మృతి పిట్స్‌బర్గ్ యూనివర్సిటీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఉత్తమ పరిశోధకుడు, మంచి సహోద్యోగిని కోల్పోయామని, అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఇలాంటి కష్టసమయంలో స్నేహితులు, సహోద్యోగులు కుటుంబానికి అండగా ఉంటారని పేర్కొంది. సార్స్-కోవ్-2 వ్యాప్తికి కారణమయ్యే సెల్యులార్ మెకానిజమ్‌, దానిలోని మార్పులను ప్రాతిపదికను అర్థం చేసుకోవడానికి బింగ్ పరిశోధన చేశాడని, ఇందులో పురోగతి సాధించాడని పిట్స్‌బర్గ్ వర్సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కాంప్యూటేషనల్ అండ్ సిస్టమ్ బయాలజీ విభాగంలోని ఆయన సహచరులు పేర్కొన్నారు. లీయూ అత్యుత్తమ పరిశోధకుడు, ఉత్తమ గురువు… చేపట్టిన పరిశోధనలు పూర్తి చేస్తానని ప్రతిజ్ఞ చేశారని, ఇది ఆయనకు శాస్త్రీయ పరిశోధనలపై ఉన్న నిబద్దతకు నిదర్శనమని స్కూల్ ఆఫ్ మెడిసిన్ నివాళులర్పించింది.