సింగపూర్‌లో 4800 మంది భారతీయులకు కరోనా
సింగపూర్‌లో అనేక మంది భారతీయులకు కరోనా సోకింది అని అక్కడి అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ చివరినాటికి 4800 మంది భారతీయులు కొవిడ్-19 బారిన పడ్డారని భారత హైకమిషనర్ జావేద్ అష్రఫ్ తెలిపారు. వారిలో ఇద్దరు మరణించారని వెల్లడించారు. బాధితుల్లో 90శాతం మంది వసతి గృహాల్లో నివాసం ఉంటున్న కార్మికులేనని సోమవారం ఆయన పేర్కొన్నారు. సింగపూర్‌లో ఆదివారం నాటికి 18,205 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా 18 మంది మరణించారు. దేశంలో వ్యాధి క్రమంగా విస్తరిస్తుండటంతో సింగపూర్‌లో ఉన్న భారత విద్యార్థులు, కార్మికులు సొంతదేశం వెళ్లిపోవాలని భావిస్తున్నారని అష్రఫ్ వెల్లడించారు. భారత్‌కు వచ్చేందుకు 3500 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, అందుకు వీలుకాకపోతే తమకు వసతి కల్పించాలని కోరుతున్నారని తెలిపారు. వర్క్ పర్మిట్‌పై సింగపూర్‌లో ఉంటున్నవారిలో ఎక్కువమంది కంపెనీలు ఏర్పాటుచేసిన వసతిగృహాల్లోనే ఉంటున్నారు. దేశంలో నమోదైన కొవిడ్ -19 కేసుల్లో అలాంటి వసతి గృహాల్లోనివారే 90శాతం మంది ఉన్నారు. ఈ వసతిగృహాల్లో కరోనా కేసులు పెరుగుతుండగా ఇతర ప్రాంతాల్లో తగ్గుముఖం పట్టాయి.