బయట దేశాల నుండి భారతదేశానికి

డెక్కన్ న్యూస్ : కరోనా మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ కసరత్తు చేపడుతున్నది. ఈ నెల 7 నుంచి విడుతల వారీగా వారిని తరలించనున్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. పేమెంట్‌ ప్రాతిపదికన (సొంత ఖర్చులతో అనే అర్థంలో) విమానాలు, నౌకల ద్వారా వారిని తీసుకురానున్నట్లు తెలిపింది. విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు భారతీయుల వివరాలు సేకరిస్తున్నాయని వివరించింది. వైరస్‌ లక్షణాలు లేనివారిని మాత్రమే స్వదేశానికి వచ్చేందుకు అనుమతిస్తామని పేర్కొంది. ఇక్కడకు చేరుకున్న తర్వాత మరోసారి వారికి స్క్రీనింగ్‌ నిర్వహిస్తామని, అనంతరం 14 రోజులపాటు పేమెంట్‌ ప్రాతిపదికన క్వారంటైన్‌లో ఉంచుతామని తెలిపింది. గమ్యస్థానాలకు చేరుకున్న తర్వాత వారందరూ ఆరోగ్య సేతు యాప్‌లో తప్పనిసరిగా రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. విదేశాల నుంచి వచ్చే వారి కోసం టెస్టింగ్‌, క్వారంటైన్‌, ఇతర ఏర్పాట్లు చేసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమాన రాకపోకలపై భారత్‌ మార్చి 23న నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

తొలి విడుతలో 19 లక్షల మంది..!
ప్రవాస భారతీయుల్లో దాదాపు 70 శాతం మంది నివసిస్తున్న గల్ఫ్‌ దేశాలతో ఈ తరలింపు ప్రక్రియ మొదలుపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. తొలి విడుతలో సుమారు 19 లక్షల మందిని స్వదేశానికి తీసుకురానున్నట్లు చెప్పారు. మొదట యూఏఈ, అనంతరం సౌదీ అరేబియా, కువైట్‌ నుంచి భారతీయులను తరలించనున్నట్లు పేర్కొన్నారు.