మరో రెండోవారాలపాటు లాక్‌డౌన్ పొడిగింపు
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు మరో రెండోవారాలపాటు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్-19పై విస్తృత సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. మే 4 నుంచి 17 వరకు లాక్‌డౌన్ కొనసాగనుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
మూడో విడత లాక్‌డౌన్‌లో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఉన్న జిల్లాలకు కొన్ని మినహాయింపులు ఇస్తూ నూతన మార్గదర్శకాలను హోంశాఖ జారీ చేసింది. అయితే జోన్లతో సంబంధం లేకండా విమాన, రైల్వే, మెట్రో, అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టంచేసింది. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, మాల్స్, జిమ్ములు సైతం తెరుచుకోవు. గుమిగూడడానికి అవకాశం ఉన్న సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, మతపరమైన సమావేశాలకు అనుమతివ్వబోమని హోంశాఖ స్పష్టంచేసింది.