ప్రారంభమైన మోడీ వీడియో కాన్ఫరెన్స్
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలపై మోడీ దృష్టి సారించారు. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసారు. ఈ భేటీలో తెలంగాణ , ఏపీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌లతో పాటు అన్ని రాష్ట్రాల సీఎంలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మే 3 తరువాత లాక్‌డౌన్‌ను కొనసాగించడమా? లేక దశలవారీగా ఎత్తివేయడమా? అనే విషయంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. లాక్‌డౌన్ ఎత్తివేతపై అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా వారు చర్చిస్తారు. అలాగే ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులను, కరోనా నియంత్రణకు చేపడుతున్న చర్యలను ప్రధానికి ముఖ్యమంత్రులు వివరించనున్నారు. లాక్‌డౌన్ పరిస్థితులపై సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ప్రధాని సమీక్షిస్తున్నారు. ఎగ్జిట్ ప్లాన్, దశలవారీగా అనుసరించాల్సిన వ్యూహాలు ముఖ్యంగా చర్చకు రానున్నాయి. కరోనా కట్టడికి లాక్‌డౌన్ మరి కొన్నాళ్లు కొనసాగించడమే మేలని పలు రాష్ట్రాలు అభిప్రాయపడుతున్న తరుణంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు లాక్‌డౌన్ కారణంగా ఆర్థికంగా చాలా నష్టపోవడంతో.. ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని పలు రాష్ట్రాలు ఇప్పటికే కేంద్రాన్ని కోరాయి. వాటిపై కూడా ప్రధాని సమావేశంలో చర్చించనున్నారు.